రానా, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా విరాటపర్వం.. అయితే వరంగల్ కు చెందిన ఒక మహిళ జీవిత కథను ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అయితే విరాటపర్వం కేవలం సినిమా మాత్రమే కాదు.. ఓ ఓరుగల్లు బిడ్డ సరళ జీవిత కథ కావడంతో ప్రజల నుండి అశేష స్పందన లభించింది. ధైర్యశాలి, లక్ష్యం కోసం చిన్న వయసులోనే ప్రాణాలు వదిలిన ఓరుగల్లు బిడ్డ సరళ జీవితగాథ ఆధారంగా విరాటపర్వం సినిమాని దర్శకుడు వేణు ఊడుగుల తెరకెక్కించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుత భూపాలపల్లి జిల్లా మోరంచపల్లికి చెందిన స్వరాజ్యం, భిక్షమయ్యలకు నలుగురు సంతానం. అక్క, ఇద్దరు సోదరుల తర్వాత నాలుగో సంతానంగా జన్మించిన సరళ. తండ్రి భిక్షమయ్య వామపక్ష విప్లవభావాలు కలిగిన వ్యక్తి కావడంతో సరళ కూడా విప్లవ భావజాలాలు ఆమెను ఆకట్టుకున్నాయి. అప్పట్లో ఈ ప్రాంతమంతా వామపక్ష ప్రభావం కలిగి ఉండడంతో పిల్లల చదువుల కోసం 1985లో వీరి కుటుంబం ఖమ్మం వెళ్లిపోయింది.
సరళ పైకి చెప్పకపోయినా.. ఎలాగైనా ఉద్యమంలోకి వెళ్లి పోరాడాలనుకునేది. ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేయగానే ఇంట్లో చెప్తే వద్దంటారని కుటుంబసభ్యులకు చెప్పకుండా అడవిబాట పట్టింది సరళ. పీపుల్స్‌వార్ లో పనిచేస్తున్న శంకరన్నను వెతుక్కుంటూ ఖమ్మం నుంచి నిజామాబాద్ అడవుల్లోకి వెళ్లింది. అక్కడి ఉద్యమకారులు సరళను పోలీస్ ఇన్‌ఫార్మర్ అనుకొని హతమార్చారు. సరళ ఇంట్లో నుంచి వెళ్లాక సుమారు 35 రోజులకు పీపుల్స్‌వార్ విడుదల చేసిన లేఖ ద్వారా సరళ చనిపోయిందనే విషయం సరళ కుటుంబ సభ్యులకు తెలిసింది.
సరళ గురించి తెలుసుకున్న సినిమా డైరెక్టర్ వేణు ఉడుగుల.. తన జీవిత చరిత్రను సినిమాగా చిత్రించాలనుకున్నారు. అందులో భాగంగానే సరళ సోదరుడు వరంగల్ లోని ప్రశాంతి ఆసుపత్రి ఛైర్మన్ తూము మోహన్ రావు ను కలిశారు. సరళ చరిత్రను విరాటపర్వం పేరుతో చిత్రీకరిస్తున్నట్టు తెలిపారు. అడవికి వెళ్లిన తర్వాత సరళ అనుభవించిన కష్టాలు, ఎదుర్కొన్న సవాళ్లను లోతుగా పరిశీలించి చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు వివరించారు.
ఇక సినిమా విషయానికొస్తే.. సరళ పాత్రలో నటించిన సాయి పల్లవి ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకుంటోంది. తన నటనతో అందరిని మంత్రముగ్ధులను చేసిందనడంలో అతిశయోక్తి లేదు. అయితే.. ఇటీవల వరంగల్ లో జరిగిన విరాటపర్వం ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న సాయి పల్లవి.. సరళ తల్లి, కుటుంబసభ్యులను కలిశారు. సరళ తల్లి ఎంతో ప్రేమతో సాయి పల్లవిని దగ్గరికి తీసుకుని ఆప్యాయంగా మాట్లాడింది. ఆమెను చూసి సాయి పల్లవి కూడా కన్నీరు పెట్టుకుంది.
Advertisements
సాయి పల్లవిని చూడగానే మా చెల్లెలు సరళను చూసినట్టు అనుభూతి పొందామని.. దశాబ్దాల కిందట మా నుంచి దూరమైన చెల్లి మళ్లీ వచ్చినట్టు ఉందంటూ భావోద్వేగానికి గురయ్యామన్నారు సరళ సోదరుడు మోహన్ రావు. పల్లవిని చూడగానే అంతా ఏడ్చేశామని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తమ ఇంటికి వచ్చిన పల్లవికి తమ ఇంటి ఆడపడుచులా భావించి చీర పెట్టి పంపించామని తెలిపారు. తానను ఎప్పటికీ తమ ఇంటి ఆడపడుచుగానే భావిస్తామని చెప్పారు మోహన్ రావు.