భారతీయ రైల్వే తాజాగా రిటైర్మెంట్ పొందిన పలువురు అధికారులు, సిబ్బందికి వినూత్న రీతిలో వీడ్కోలు పలికింది. రైల్వే చరిత్రలోనే తొలిసారిగా ఒకేసారి 2,320 మంది రైల్వే అధికారులు, సిబ్బందికి ఒకే వేదికపై వీడ్కోలు పలికారు. అందుకు గాను రైల్వే శాఖ వర్చువల్ రిటైర్మెంట్ ఫంక్షన్‌ను నిర్వహించింది. జూలై 31, 2020న దేశంలోని అన్ని రైల్వే జోన్లు, డివిజన్లు, ప్రొడక్షన్ యూనిట్లకు చెందిన రిటైరైన 2,320 మందికి ఒకే వేదికపై వర్చువల్‌గా ఒకేసారి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమానికి రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ రైల్వేస్ సురేష్ సి.అంగడి, రైల్వే బోర్డు సెక్రెటరీ సుశాంత్ కుమార్ మిశ్రాతోపాటు పలువురు రైల్వే సీనియర్ అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్బంగా పీయూష్ గోయల్ రిటైర్మెంట్ పొందిన రైల్వే అధికారులు, సిబ్బందిని అభినందించారు. ఎన్నో సంవత్సరాలుగా వారు రైల్వేలో అందించిన సేవలను కొనియాడారు. ఇకపై కూడా వారు దేశానికి, ప్రజలకు సేవలందించాలని కోరుకుంటున్నానని తెలిపారు. రిటైర్మెంట్ అనేది వృత్తికే కానీ.. చేసే సేవకు కాదన్నారు. రిటైరైన రైల్వే ఉద్యోగులు, సిబ్బంది జాతి నిర్మాణం కోసం సేవలందించాలని, ప్రజలకు ప్రభుత్వం అందజేస్తున్న పథకాలు, సేవల గురించి చెప్పి వారిని మరింత జాగృతం చేయాలన్నారు.
భారతీయ రైల్వేకు ఉద్యోగులు, సిబ్బంది ఎంతో విలువైన సేవలను అందించారని పీయూష్ గోయల్ అన్నారు. గత కొన్నేళ్లుగా రైల్వే శాఖ ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలను అందించేందుకు కృషి చేస్తుందన్నారు. అందుకు రైల్వే ఉద్యోగులు, సిబ్బంది ఎంతగానో కష్టపడుతున్నారన్నారు. ఇక కోవిడ్ సమయంలో సరుకు రవాణా, పార్శిల్ ట్రెయిన్లు, శ్రామిక్ ప్రత్యేక రైళ్లను నడిపామని, ఆ సమయంలో సిబ్బంది ఎంతగానో సేవలందించారని, కనుక వారు కూడా కోవిడ్ వారియర్సే అని కొనియాడారు. రిటైర్మెంట్ అనేది జీవితమనే ప్రయాణంలో వచ్చే ఒక రైల్వే స్టేషన్ స్టాప్ అని.. రిటైర్ అయ్యాక కూడా ఉద్యోగులు, సిబ్బంది దేశం కోసం సేవలు అందించవచ్చని అన్నారు.
రైల్వేలో పనిచేసిన రిటైర్ అయినవారు సమాజం కోసం ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని గోయల్ అన్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టడం, వ్యర్థాల నుంచి ఎరువును తయారు చేయడం, రైతులు అధిక దిగుబడి సాధించేలా వారికి పనికి వచ్చే వినూత్న ఆవిష్కరణలు చేయడం.. తదితర కార్యక్రమాల్లో భాగం కావాలన్నారు. రైల్వే అనేది ప్రభుత్వ శాఖల్లో ఒకటని.. ఇందులో పనిచేసిన వారికి ప్రభుత్వ విభాగంలో పనిచేసిన అనుభవం ఉంటుందని.. దాన్ని ప్రజా సేవకు వినియోగించాలన్నారు.