ఇండియాలో కొన్ని నెలలుగా వైరల్ కేసులు పెరిగిపోతున్నాయి. దగ్గు, జ్వరం, శ్వాస సంబంధ రుగ్మతలతో బాధ పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం వాయు కాలుష్యమని ఆరోగ్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. చాలామంది ఇన్ ఫ్లు ఎంజా తరహా జ్వరాల బారిన పడడానికి ‘హెచ్-3ఎన్ 2’ అనే సబ్ టైప్ ముఖ్య కారణమవుతోందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ వెల్లడించింది. గత రెండు, మూడు నెలలుగా ఈ సబ్ టైప్ రుగ్మత తీవ్రంగా ఉందని ఇతర సబ్ టైప్ ల కన్నా దీనివల్ల రోగులు ఆసుపత్రుల్లో చేరుతున్న కేసులు పెరుగుతున్నాయని ఈ సంస్థకు చెందిన రీసెర్చర్లు పేర్కొన్నారు.
వైరస్ నివారణకు ప్రజలు తమను తాము రక్షించుకోవలసి ఉంటుందంటూ వారు పలు సూచనలు చేశారు. ఇష్టం వచ్చినట్టు యాంటీ బయాటిక్స్ వాడడం మంచిది కాదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా హెచ్చరిస్తోంది. సీజనల్ ఫీవర్ అన్నది 5 నుంచి 7 రోజుల పాటు ఉంటుందని, ముఖ్యంగా 15 ఏళ్ళ లోపు పిల్లలు, 50 ఏళ్ళు పైబడినవారిలో ఈ జ్వరం సోకుతుందని ఈ సంస్థ వెల్లడించింది.
ఇదే సమయంలో డాక్టర్లు కూడా యాంటీ బయాటిక్స్ మందులు సూచించకుండా సింప్టోమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చిన పక్షంలో ఈ రుగ్మతలను కొంతవరకు నివారించవచ్చునని వివరించింది. చాలామంది అజిత్రోమైసిన్, అమోక్సిక్లెవ్ వంటి యాంటీ బయాటిక్స్ ని వాడుతుంటారు.. కొంతవరకు నయమైందని భావించగానే వాటిని తీసుకోవడం మానివేస్తుంటారు.. ఇది మంచిది కాదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఓ స్టేట్మెంట్ లో పేర్కొంది.
అసలు మొదట డాక్టర్ల సలహా తీసుకోవాలని సూచించింది. యాంటీ బయాటిక్స్ అవసరం నిజంగా ఉన్నప్పుడు, రెజిస్టెన్స్ కారణంగా అది పని చేయదు అని నిపుణులు వివరించారు. కొన్ని సందర్భాల్లో జ్వరం త్వరగానే తగ్గినా దగ్గు మూడు వారాల పాటు ఉంటుందని, అందువల్లే వైరల్ ఫీవర్ రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.