దేశవ్యాప్తంగా ఉన్న షిర్డీసాయిబాబా ఆలయాలలో దేనికదే ప్రత్యేకం అయినప్పటికీ విశాఖ చినగదిలిలోని నార్త్ షిర్డీ సాయి దేవాలయం మాత్రం ఇంకా ప్రత్యేకం. ఎందుకంటే ఇక్కడి బాబా మాట్లాడుతారు. సమాధి అయిన సాయిబాబా బోధనలు చేయడం ఏంటీ అనుకుంటున్నారా..? నిజమండి..! ఈ ఆలయంలోకి అడుగుపెట్టగానే స్వయంగా సాయిబాబానే భక్తులకు సూక్తులు భోధిస్తూ దర్శనమిస్తారు.
ఇదంతా రోబోటిక్ సాయి మహిమ. జీవం ఉట్టిపడే రూపంతో, మాటలకు నోరు కదుపుతూ, తల ఊపుతూ, సహజమైన ముఖ కవళికలతో.. ఆ సాయి నాథుడే దిగివచ్చారా అనే రీతిలో మైమరిపిస్తోంది.. రోబో గాడ్. ఈ బాబాను ఏయూ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థి అయిన రవిచంద్ మూడేళ్లు శ్రమించి రూపొందించారు. సిలికాన్ పదార్థంతో ముఖాన్ని, కెనడా నుంచి తెప్పించిన ప్రత్యేక ఫైబర్ గ్లాస్ తో మిగిలిన భాగాలను తయారు చేశారు.
అధునిక సాంకేతికతకు, వాయిస్ జోడించడంతో.. ఆ సాయిబాబానే చూసిన అనుభూతిని భక్తులు పొందుతున్నారు. ఈ దైవ రోబోను దర్శించుకున్న భక్తుల ప్రచారంతో.. విశాఖ నుంచే కాక చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఆలయానికి ఇతర భక్తుల తాకిడి బాగా పెరిగింది.నిజంగా ఈ రోబో బాబాను చూసి ఆశ్చర్యపోయాను.. వైజాగ్ లో ఇలాంటి రోబో సాయి ఉండటం ఆనందంగా ఉంది.. అందరూ వచ్చి చూడాలి.. నిజంగా షిర్డీలోని సాయిబాబాను చూసినట్లే ఉందని తమ స్వీయ అనుభూతిని పంచుకున్నారు భక్తులు.
షిర్డీలో ఉన్న సాయి లాగానే ఈ బాబా ఉన్నారు. చినగదిలి లోని నార్త్ షిర్డీ సాయి ఆలయంలో ఉన్న ఈ బాబాను చూసేందుకు చాలా మంది భక్తులు వస్తున్నారు.