శిరోముండనం కేసులో విశాఖ సీపీ మనీష్ కుమార్ సిన్హా చాలా ఫాస్ట్ గా వ్యవహరించారు. చాలా స్పీడుగా.. సీసీ ఫుటేజ్ తీయడం.. వెంటనే నిందితులను గుర్తించడం.. ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి. నిజంగా విశాఖ సీపీని అభినందించాల్సిందే. దళితుడు అంటే ఇప్పటికీ ఎలా చూస్తున్నారో ఈ సంఘటన బయటపెట్టింది. దళితుడు అంటే దొంగతనం చేసేవాడు.. ఎదురు తిరక్కుండా ఉండాల్సినవాడు అన్న డిక్షనరీనే చదివినవారంతా అదే రూటులో ఉన్నారు. ఎన్ని చదువులు చదివినా.. ఎంత సంపాదించినా.. వారు మానవత్వం మరిచి దళితుడిని అవమానించి.. సంస్కారాన్ని మాత్రం సంపాదించలేకపోయారని ప్రూవ్ చేసుకున్నారు.
కేవలం ఒక మొబైల్ కనపడకుండా పోయిందని.. ఆ కుర్రాడిని అంత దారుణంగా హింసించారు. ఇంకా పైగా.. శిరోముండనం చేసి.. తమ కసి తీర్చుకున్నారు. ఆడవారు సైతం బెల్టుతో దారుణంగా కొడుతున్న సీన్లు చూస్తుంటే.. మన సమాజం అందించిన కుసంస్కారాన్ని యంగ్ జనరేషన్ సైతం ఎంతగా ఎక్కించుకున్నారో అర్ధమవుతోంది.
అయితే ఇక్కడే వైసీపీ సర్కార్ కు ఒక ప్రశ్న. ఘటన బయటికొచ్చిన 24 గంటల్లోనే చర్యలు తీసుకున్న పోలీసులు… మరి గోదావరి జిల్లాలో జరిగిన శిరోముండనం కేసులో.. ఇంత ఫాస్ట్ గా ఎందుకు రియాక్ట్ కాలేదు? పైగా రాష్ట్రపతి జోక్యం చేసుకున్నాక గాని ఆ ఫైలు కదలలేదు. ఆన్సర్ మన దగ్గర ఉంది. అక్కడ నిందితుడు వైసీపీ నేత కాబట్టి.. అలా చేసుండొచ్చు. కాని అదే ఆన్సర్ వైసీపీ నేతల నోట వినాలనుంది.
అంతెందుకు ఇదే విశాఖ సీపీ మనీష్ కుమార్ సిన్హా.. మొన్న వాలంటీర్ ను వేధించి.. ఆమె భర్తపై కత్తితో దాడి చేసిన వైసీపీ నేతను అరెస్ట్ చేయలేకపోయారు. పైగా కేసు కూడా పెట్టలేకపోయారు. ఎదురు బాధితులపైనే కేసు పెట్టారని.. స్వయంగా జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటన విడుదల చేశారు. వాలంటీర్ కుటుంబం జనసేన అభిమానులట. అందుకనే పవన్ కల్యాణ్ రియాక్టరయ్యారు. మరి అదే విశాఖ నగరంలో ఒక చోట ఒక్కో తీరుగా పోలీసులు వ్యవహారం చేస్తారా? నిందితులు వైసీపీ వారైతే.. ఒకలా.. వేరేవారు అయితే ఒకలా ఉంటారా? అదే అర్ధం కావడం లేదు. మరి కనీసం డీజీపీ గౌతమ్ సవాంగ్ గారైనా దీనిపై వివరణ ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు ఈ కేసులో రియాక్ట్ అయినట్లే.. అన్ని కేసుల్లో రియాక్ట్ అయితే… దళితులు కాస్త పోలీసులపై నమ్మకం పెట్టుకుంటారు. లేదంటే వేరేగా ఉంటారు.