విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం ఆయిందని కేంద్ర మంత్రి ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు. విశాఖ రైల్వే జోన్ అనేది ఏపీ ప్రజల చిరకాల కోరిక అని అన్నారు. ప్రజల కోరిక బీజేపీతోనే సాధ్యమైందన్నారు.
ఏపీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరాల జల్లు కురిపించారని కొనియాడారు. ఇక.. కోనసీమ రైల్వే లైనుకి రాష్ట్ర ప్రభుత్వం షేర్ కట్టకపోవడంతో బీజేపీ మాత్రమే ఉద్యమం చేస్తోందని ప్రకటించారని పేర్కొన్నారు.
కడప-బెంగుళూరు మధ్య రైల్వే లైను వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం షేర్ జమ చేయకపోవడంతో.. అనేక అభివృద్ది పనులు ఆగిపోతాయని ఆరోపించారు సోము. అందుకు రాష్ట్ర ప్రభుత్వం షేర్ కట్టే వరకు ఉద్యమిస్తామని సోము వీర్రాజు ప్రకటించారు.
ఏపీ రైల్వే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఆంధ్రాకు అన్యాయం జరుగుతోందన్నారు. ఏపీ ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచన ఉంటే వెంటనే ప్రభుత్వ షేర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు సోము వీర్రాజు.