తమిళనాట సినీ పాలిటిక్స్ మరింత జోరందుకుంటున్నాయి. కమల్ హాసన్, రజనీకాంత్ ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటుండగా.. మరో హీరో కూడా రంగంలోకి దిగబోతున్నాడని తెలుస్తోంది. యువ నటుడు విశాల్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శిగా, తమిళ చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడిగా గెలిచి.. తన క్రేజును నిరూపించుకున్నాడు విశాల్. ఇదే క్రమంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఏదేని నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు విశాల్ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు.తన అభిమాన సంఘాలకు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చినట్టుగా తెలిసింది.
వాస్తవానికి గతంలో ఆర్కేనగర్ ఉపఎన్నిక సమయంలోనే పొలిటికల్ అరంగేట్రానికి విశాల్ సిద్దమయ్యాడు. ఆ ఎన్నిక కోసం నామినేషన్ కూడా వేశాడు. కానీ చివరి నిమిషంలో ఆయన నామినేషన్‌ను ప్రతిపాదించినవారు తమ మద్దతుపై వెనక్కి తగ్గారు. దీంతో ఆయన నామినేషన్‌ను ఈసీ తిరస్కరించింది. ఈసారి మాత్రం పక్కా ప్లాన్‌తో ఎలక్షన్ వార్‌లోకి దిగేందుకు ప్లాన్ చేస్తున్నాడట.