అభిమన్యుడు సినిమా తర్వాత మళ్లీ సక్సెస్ అందుకోలేకపోయాడు విశాల్. రీసెంట్ గా ఎనిమి సినిమాతో భారీ అంచనాలు క్రియేట్ చేసినా, అది కూడా విశాల్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు మరోసారి చతికిలపడ్డాడు ఈ హీరో. ఈరోజు విశాల్ నటించిన సామాన్యుడు సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఓ సామాన్యుడు, ఎలా అసమాన్యంగా ఎదిగాడు, విలన్లను అంతమొందించాడనేది బేసిక్ లైన్. దీన్ని కొత్తగా చెప్పడంలో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు దర్శకుడు శరవణన్. సామాన్యుడు సినిమా అతి సామాన్యంగా ఉంది.
హీరో ఎస్ఐ జాబ్ కోసం ప్రయత్నిస్తుంటాడు. మరోవైపు ప్రేమలో కూడా ఉంటాడు. మంచి కుటుంబం ఉంటుంది. అంతలోనే సడెన్ గా పెద్ద కుదుపు. హీరో చెల్లెల్ని ఎవరో హత్య చేస్తారు. తనే హత్య చేశానంటూ ఒకడు పోలీసులకు లొంగిపోతాడు కూడా. కానీ హీరోకు అనుమానం. ఆ అనుమానమే నిజమౌతుంది. అలా తవ్వుకుంటూ వెళ్తాడు. చివరికి ఓ వ్యాపారవేత్తను కనుగొంటాడు. అతడు, హీరో చెల్లెల్ని ఎందుకు చంపుతాడు. ఈ మొత్తం వ్యవహారం వెనక మరో కోణం ఏంటి అనేది సామాన్యుడు కథ.
ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ స్టోరీస్ ను ఎంత గ్రిప్పింగ్ గా చెబితే అంత మంచిది. సామాన్యుడులో పెద్ద మైనస్ ఇదే. సినిమా స్టార్ట్ అవ్వడమే రొటీన్ గా మొదలవుతుంది. ఇంటర్వెల్ కార్డ్ పడేంత వరకు స్క్రీన్ ప్లే చాలా నీరసంగా ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత సినిమా ఊపందుకున్నట్టు కనిపించినప్పటికీ, కొంతసేపటికే మళ్లీ రొటీన్ ప్లే కనిపిస్తుంది. ఇలా పడుతూలేస్తూ సాగిన సామాన్యుడు, చివరికి ఓ రొటీన్ రివెంజ్ డ్రామా సినిమా అనిపించుకుంది.
నిజానికి ఇలాంటి రివెంజ్ డ్రామాలు విశాల్ కు కొత్తకాదు. ఎప్పుడూ ఇలాంటి సినిమాలే చేస్తుంటాడు ఈ హీరో. మరీ రొటీన్ అనిపిస్తుందని, దీనికి సిస్టర్ సెంటిమెంట్ యాడ్ చేసినట్టున్నారు. పైగా ఓ ఫ్యాక్టరీ వల్ల నష్టపోయిన కుటుంబం తరఫున పోరాడే వ్యక్తి థ్రెడ్ ను కూడా జోడించారు. ఈ కొత్త ఎలిమెంట్స్ ఏవీ సినిమాలో వర్కవుట్ అవ్వలేదు. పైపెచ్చు నీరసం తెప్పిస్తాయి.
ఉన్నంతలో ఈ సినిమాలో మెచ్చుకోదగ్గ అంశం ఏదైనా ఉందంటే విశాల్ పెర్ఫార్మెన్స్. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు విశాల్. యాక్షన్ సీన్స్ ఇరగదీశాడు. యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. హీరోయిన్ డింపుల్ హయతికి ఈ సినిమా కథకు అస్సలు సంబంధమే లేదు. కెవిన్ రాజా కెమెరా పనితనం బాగుంది.
ఓవరాల్ గా సామాన్యుడు సినిమాను 3 యాక్షన్ సీన్స్ కోసం చూడొచ్చు. కేవలం ఆ యాక్షన్ సీన్స్ కోసం మిగతా సినిమా మొత్తాన్ని భరించాల్సి ఉంటుంది. మీదే ఛాయిస్.