ఏపీలో ఆలయాల అభిషేకాలపై వివాదం కొనసాగుతోంది. బీజేపీ నేతలు దేవాదాయ శాఖ నిర్ణయాలను తప్పుబడుతూ విమర్శలు చేస్తున్నారు. తాజాగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి స్పందిస్తూ.. ఆలయాల అభిషేకాలపై వివాదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. కాణిపాకంలో 700 ఉన్న అభిషేకం 5 వేలు చేయడం అన్యాయమని.. శ్రీశైలంలో లక్ష రూపాయలకు ఒక సేవ ప్రవేశపెట్టారని వివరించారు. ఇంకెందుకు ఆలస్యం దేవాదాయ, ధర్మాదాయ శాఖను… దేవాదాయ, ఆదాయ శాఖగా మార్చండంటూ సెటైర్లు వేశారు.
అభిషేకాలతో ప్రభుత్వం వ్యాపారం మానుకోవాలని హితవు పలికారు. దోచుకోవడానికి ల్యాండ్, సాండ్, వైన్, మైన్ ఉన్నాయని.. ఆలయాల్లో కూడా దోచుకుంటారా? అని ప్రశ్నించారు. చర్చీలు, మసీదుల నుంచి డబ్బులు తీసుకోకుండా ఆలయాల నుంచే పన్నుల రూపంలో ఎందుకు తీసుకుంటున్నారని నిలదీశారు. కదిరిలో మైనర్ బాలిక వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుందని.. రాజకీయ నాయకుడు ఇంతియాజ్ దీనికి కారణమని ఆరోపించారు. రాష్ట్రంలో దిశ చట్టానికి దశ-దిశ లేదన్నారు. అన్ని ఆధారాలు ఉన్నా కానీ, మైనారిటీ అనే కోణంలో ఓట్ల రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. హిందువులు, బీసీల ఓట్లు అవసరం లేదా? అని అడిగారు.
మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా చేయడం ఒక డ్రామా అని అన్నారు విష్ణువర్ధన్ రెడ్డి. సీఎం జగన్ అనుమతిస్తే రాజీనామా చేస్తామని ఇతర ఎమ్మెల్యేలు కూడా డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. అంత చిత్తశుద్ధి ఉంటే ఏపీ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు. టీడీపీ కూడా డ్రామా చేస్తోందని.. దమ్ముంటే ఆపార్టీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలన్నారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామంటే రాయలసీమ ఎమ్మెల్యేలు ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నించారు. రాయలసీమ కోసం, నిధులకోసం, ప్రాజెక్టుల కోసం ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? అని నిలదీశారు. రాయలసీమలో ప్రజాప్రతినిధులు ద్రోహులు అంటూ విమర్శించారు.
మాజీ కేంద్రమంత్రి జైరాం రమేష్ కర్నూలులో మాట్లాడడానికి సిగ్గులేకుంటే పక్కన కూర్చున్న ఏపీ కాంగ్రెస్ నేతలకైనా ఉండాలి కదా అని చురకలంటించారు విష్ణువర్ధన్ రెడ్డి. రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్ గా ఉన్నది ఆయనే అని గుర్తు చేశారు. ఇక కరోనా సమయంలో అంబులెన్సులు అడ్డుకున్న కేసీఆర్ జాతీయ పార్టీ పెడతారా? అని ప్రశ్నించారు. ఏపీకి జరుగుతున్న అన్యాయాలపై వైసీపీ ఎందుకు మాట్లాడడం లేదన్నారు. రాజకీయ స్వార్థంతో వైసీపీ, టీఆర్ఎస్ ఒప్పందం కుదుర్చుకున్నాయని విమర్శించారు. రాహుల్ గాంధీ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి పాదయాత్ర చేయాలన్నారు. విభజన సమయంలో అన్యాయం చేసి ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని పాదయాత్ర చేస్తారని ప్రశ్నించారు. ఏపీ ఇంకా ఉందా.. తగలబడి పోయిందా అని చూడడానికి రాహుల్ గాంధీ వస్తున్నారా? అని నిలదీశారు విష్ణువర్ధన్ రెడ్డి.