మొన్న శుక్రవారం ముచ్చటగా 3 సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. విశ్వక్ నటించిన అశోకవనంలో అర్జునకల్యాణం, సుమ నటించిన జయమ్మ పంచాయితీ, శ్రీవిష్ణు చేసిన భళా తందనాన సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో అశోకవనంలో అర్జునకల్యాణం సినిమా మాత్రమే క్లిక్ అయింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎలిమెంట్స్, హ్యూమన్ ఎమోషన్స్ తో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.
విశ్వక్ నటించిన ఈ సినిమా స్టోరీలైన్ చాలా చిన్నది. కానీ దాన్ని చెప్పే విధానం (స్క్రీన్ ప్లే) ఆకట్టుకుంది. పైగా పాటలు క్లిక్ అవ్వడంతో ఆడియన్స్ కు రీచ్ అయింది. కరోనా/లాక్ డౌన్ కాన్సెప్ట్ అనేది ఔట్ డేట్ అయినప్పటికీ.. మిగతా ఎలిమెంట్స్, ఎమోషన్స్ అన్నీ బాగా పండడంతో సినిమా హిట్ అయింది.
అయితే బాధాకరమైన విషయం ఏంటంటే.. ఈ సినిమా సక్సెస్ అయినప్పటికీ వసూళ్లు మాత్రం ఆశించిన స్థాయిలో రావడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పరీక్షల సీజన్ నడుస్తోంది. విద్యార్థులు పరీక్షలకు, వాళ్ల తల్లిదండ్రులు ఆలయాలకు హాజరవుతున్నారు. దీంతో థియేటర్లకు వచ్చే సంఖ్య బాగా తగ్గిపోయింది.
హిట్టయిన విశ్వక్ సేన్ సినిమానే ఇలా ఉందంటే, ఇక శ్రీవిష్ణు, సుమ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికేం లేదు. ఆ రెండు సినిమాలు పూర్తిస్థాయిలో దుకాణం సర్దేసినట్టే.