కరోనా వైరస్ ప్రభావంతో ఇండియాలో చాలాకాలంగా క్రికెట్ మ్యాచులు జరగలేదు. పరిస్థితులు కాస్త మెరుగయ్యాక క్రికెట్ ఆడుతున్నా… ప్రేక్షకులను మాత్రం అనుమతించటం లేదు. విదేశాల్లో 50శాతం ప్రేక్షకులను అనుమతిస్తున్న దశలో, ఇండియాలోనూ 50శాతం ప్రేక్షకులతో ఆటను కొనసాగించే అవకాశం కనపడుతుంది.
చెన్నై, పుణే, అహ్మాదాబాద్ లలో ఇంగ్లాండ్ తో జరిగే టెస్టు మ్యాచులకు అక్కడ పరిస్థితులను బట్టి 25-50శాతం ప్రేక్షకులను అనుమతించే యోచనలో బీసీసీఐ ఉంది. అయితే ఇందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తీసుకోనుంది. చివరిసారిగా ఇండియాలో జనవరి 2020లో ఇండియా- ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ప్రేక్షకుల మధ్య జరిగింది. దాదాపు సంవత్సరం తర్వాత ప్రేక్షకుల మధ్య మ్యాచులు జరిగే అవకాశం ఉంది.
అయితే, ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తక్ అలీ టోర్నమెంట్ తో పాటు ఇటీవలి రంజీ టోర్నమెంట్ సైతం ప్రేక్షకులు లేకుండానే జరిగాయి. ఇప్పుడు ఇండియా-ఇంగ్లాండ్ సిరీస్ లు ప్రేక్షకుల మధ్య సాగితే ఐపీఎల్ 2021సీజన్ కు లైన్ క్లియర్ అయినట్లుగానే విశ్లేషకులు భావిస్తున్నారు.
ఫిబ్రవరి 5నుండి ఇంగ్లాండ్ జట్టు భారత్ లో పర్యటించనుంది.