గతేడాది కేరళలో సంచలనం రేపిన మెడికో విస్మయ ఆత్మహత్య కేసులో ఎట్టకేలకు దోషికి శిక్ష ఖరారైంది. ఆమె భర్త కిరణ్ కుమార్ కు 10 ఏళ్లు జైలు శిక్ష విధించింది కొల్లాంలోని న్యాయస్థానం. 22 ఏళ్ల విస్మయను అతడే కట్నం కోసం వేధించి.. బలవన్మరణానికి పాల్పడేలా చేశాడని సోమవారం నిర్ధారించిన కోర్టు.. మంగళవారం శిక్షను ఖరారు చేసింది.
కేసు వివరాల్లోకెళ్తే.. ఆయుర్వేద వైద్య విద్యార్థి విస్మయకు ఎడ్యుకేషన్ కంప్లీట్ కాకముందే అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ కిరణ్ కుమార్ తో పెళ్లి చేశారు తల్లిదండ్రులు. కట్నంగా 100 సవర్ల బంగారం, రూ.10 లక్షల కారు, ఎకరం భూమి ఇచ్చారు. అయితే.. కారు నచ్చలేదని తనకు రూ.10 లక్షలు డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేయడం స్టార్ట్ చేశాడు కిరణ్. ఈ క్రమంలోనే విస్మయను చిత్రహింసలకు గురిచేసేవాడు.
గతేడాది జూన్ 20న తన బంధువులకు కట్నం కోసం కిరణ్ వేధిస్తున్నాడని వాట్సాప్ మెసేజ్ చేసింది విస్మయ. దాంతో కిరణ్ విచక్షణా రహితంగా కొట్టాడు. ఆ గాయాల ఫొటోలను బంధువులకు పంపిన విస్మయ.. మరుసటి రోజు కొల్లాం జిల్లా సస్థంకొట్టలోని ఇంట్లో విగతజీవిగా కనిపించింది. కుటంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు కాగా.. దీనిపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది.
పోలీసుల దర్యాప్తు అనంతరం వరకట్న వేధింపుల వలనే విస్మయ సూసైడ్ చేసుకుందని పోలీసులు చార్జ్ షీట్ ఫైల్ చేశారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం సోమవారం సంచలన తీర్పు ఇచ్చింది. విస్మయ భర్త కిరణ్ ను దోషిగా తేల్చింది. దీంతో వెంటనే పోలీసులు కిరణ్ ను అదుపులోకి తీసుకుని జైలుకు పంపారు. తాజాగా అతడికి 10 ఏళ్లు జైలుశిక్ష విధించింది న్యాయస్థానం.