వందేళ్ల ముందు ఈ విటమిన్ల గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు ప్రపంచంలో అన్ని వయసుల వారూ ఫుడ్ సప్లిమెంట్ల రూపంలో విటమిన్స్ ని తీసుకుంటున్నారు. మన శరీరానికి 13 రకాల విటమిన్లు అవసరం. అవి A, C, D, E, K. ఆల్ఫాబెట్ల ప్రకారం చూస్తే విటమిన్ A, C మధ్య విటమిన్ B ఉంటుంది. అది 8 రకాలుగా ఉంటుంది. అలా మొత్తం విటమిన్ల సంఖ్య 13 అయ్యాయి. ప్రతి విటమిన్ మరో దానికంటే భిన్నంగా ఉంటుంది. మంచి ఆరోగ్యం కోసం వాటిని తగిన మోతాదులో తీసుకోవడం చాలా అవసరం. వీటిలో విటమిన్ D మన శరీరానికి సూర్యరశ్మి నుంచి అందుతుంది. కానీ మిగతా విటమిన్లు మనకు ఆహారం నుంచే లభిస్తాయి. అయితే మోతాదుకి మించి ఈ విటమిన్స్ తీసుకుంటే మాత్రం ప్రమాదకరమని డాక్టర్లు చెబుతున్నారు.
ఇటీవల యూకే లోని ఓ హాస్పిటల్‌లో డాక్టర్లు సిఫారసు చేసిన దానికంటే ఏడురెట్లు విటమిన్-డి డోసు తీసుకోవడం వల్ల ఓ వ్యక్తి మరణించాడు. పైగా అతనికి క్షయ, చెవిలో కణితి లాంటి ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. ఒక్క యూకేలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా జనం వెర్రిగా విటమిన్-డి తీసుకుంటున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. విటమిన్లు శరీరానికి అత్యవసరమైన పోషకాలే కావచ్చు. విటమిన్-ఎ కంటిచూపును, రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. విటమిన్-బి12 మెదడు, నరాల కణజాల అభివృద్ధ్దిలో ఉపకరిస్తుంది. ఇక విటమిన్-సి అయితే ఓ శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్. క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫేట్ తదితర ఖనిజ లవణాలను శరీరం శోషించుకోవడానికి విటమిన్-డి దోహదపడుతుంది. విటమిన్-ఇ అనేది చర్మం, కళ్ల ఆరోగ్యానికి, రోగ నిరోధక వ్యవస్థ నిర్మాణానికి సహాయపడుతుంది. అయితే విటమిన్స్ ను మోతాదుకి మించి వాడితే మాత్రం తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
పాలు, గుడ్లు, చేపలు, టమాట, తాజా ఆకుకూరలు, మామిడి పండ్ల నుంచి మనకు విటమిన్-ఎ పుష్కలంగా లభిస్తుంది. జంతువుల కాలేయం, కిడ్నీలు, ఫోర్టిఫైడ్ ధాన్యాల నుంచి విటమిన్-బి12 లభిస్తుంది. ఇక బ్రకోలి, స్ట్రాబెర్రీ, నిమ్మజాతి పండ్లు, బెల్ పెప్పర్, బ్లాక్ కరెంట్స్ నుంచి విటమిన్-సి అందుతుంది. సాల్మన్ చేపలు, మాంసం, కాలేయం, గుడ్డుసొనలో విటమిన్-డి ఉంటుంది. అలాగే బాదంపప్పు, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి కాయ, పాలకూర, బఠాణీలలో విటమిన్-ఇ లభిస్తుంది. కేల్ (క్యాబేజీ రకం మొక్క), మస్టర్డ్ గ్రీన్స్ (ఆవాల ఆకులు), తాజా చిక్కుళ్లు, బ్రకోలి, కోడి మాంసం, కివీ పండు, అవకాడోలో విటమిక్-కే అందుతుంది. ఇవి తీసుకుంటే మన శరీరానికి కావాల్సిన సంపూర్ణమైన పౌష్టికారం లభిస్తుంది. మళ్లీ సప్లిమెంట్స్ వాడాల్సిన అవసరం లేదని ఎప్పటినుంచో డాక్టర్లు మనకు చెబుతున్నారు.
ఏది ఏమైనా రోజువారీ ఆహారానికి విటమిన్ సప్లిమెంట్లను జోడిస్తే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయ నుకోండి. కానీ వాటిలో శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్, మూలికలు, అమైనో ఆమ్లాలు, ఎంజైములు, ఇతర మూలకాలు ఉంటాయి. ఇవన్నీ మన శరీరం ఆరోగ్యంగా ఉండటానికి ఉపకరించేవే. ఉదాహరణకు రోజువారీగా మనం తీసుకునే విటమిన్-ఇ 15 మిల్లీగ్రాములకు మించకూడదు. కానీ, చాలా సప్లిమెంట్లలో ఆ పరిమాణం 100 నుంచి 1000 మిల్లీ గ్రాముల దాకా ఉంటున్నది.
విటమిన్-ఇ పరిమితికి మించి శరీరంలో పేరుకుపోతే, మెదడు సహా శరీర అవయవాల్లో రక్త స్రావానికి కారణమవుతుంది. ఇతర సప్లిమెంట్ల విషయంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఒక్కసారి శరీరంలో విటమిన్ టాక్సిసిటీ పెరిగిపోతే ఆ పరిస్థితి కొన్ని వారాలపాటు కొనసాగుతుంది. అలసట, తలనొప్పి, వాంతులు, చిరాకు, మూడ్‌లో హెచ్చుతగ్గులు లాంటి సవాలక్ష లక్షణాలు కనిపిస్తాయి. పండ్లు, గింజలు, కూరగాయల లాంటి సహజమైన విటమిన్ వనరులను సిఫారసు చేస్తారు. మరోదారి లేనప్పుడే కృత్రిమమైన మార్గాలను ఎంచుకుంటారు. కాబట్టే రోగులను పరీక్షించాకే పోషకాహార నిపుణులు విటమిన్ సప్లిమెంట్లను సూచిస్తారు.