ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలపై కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి ఫైర్ అయ్యారు. ఈ మేరకు పవార్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శరద్ పవార్ వ్యాఖ్యలతో తన సందేహాలు పూర్తిగా తీరిపోయాయన్నారు.
తాను ముంబైకి వచ్చినప్పుడు శరద్ పవార్ రాజుగా ఉన్నారని పేర్కొన్నారు. ఆ సమయంలో ఆయన పన్నులు వసూలే చేసేవారన్నారు. దీనికి ప్రతిఫలంగా కొందరు సొంత రాజ్యాలను ఏర్పాటు చేసుకునేందుకు ఆయన అనుమతిచ్చారని ట్వీట్ చేశారు.
బాలీవుడ్ కు చెందిన చాలా మంది ఎన్సీపీకి ఉదారంగా భారీ విరాళాాలు ఇచ్చారని పేర్కొన్నారు. ప్రతిఫలంగా వారంతా సొంత రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారని ఆయన అన్నారు. ఆ వ్యక్తులు ఎవరని తాను ఎప్పుడూ ఆలోచిస్తుండే వాడినన్నారు. కానీ శరద్ పవార్ వ్యాఖ్యలతో ఇప్పుడు తన సందేహాలన్నీ తీరిపోయాయన్నారు.
విదర్భ ముస్లిం మేధావుల ఫోరమ్ నాగ్‌పూర్‌లో ‘ఇష్యూస్ బిఫోర్ ఇండియన్ ముస్లింస్’అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శరద్ పవార్ పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ ఎదుగుదలకు ముస్లిం సమాజం నుంచి చాలా సహకారం అందిందన్నారు. దీన్ని ఎవరూ విస్మరించలేరన్నారు.
బాలీవుడ్‌ను అగ్రస్థానానికి తీసుకెళ్లడంలో ముస్లిం మైనారిటీలు అత్యధిక సహకారం అందించారని పేర్కొన్నారు. ఏ స్టార్ పేరును చెప్పకుండా శరద్ పవార్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. నేడు కళ, రచన, కవిత్వం రంగమేదైనా అత్యున్నత సహకారం మైనారిటీల నుంచి వచ్చిందన్నారు.