తెలంగాణలో కేసీఆర్ పై వ్యతిరేకతను డైవర్ట్ చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ పెట్టారని అన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. తెలంగాణలో దోచుకున్న అవినీతి సొమ్మునంతా ఇతర రాష్ట్రాల్లో ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. దేశంలో అన్ని పార్టీల కన్నా రిచ్ పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని చెప్పారు.
ప్రజల సొమ్ముతో టీఆర్ఎస్, బీఆర్ఎస్ అంటూ 4 వందల కోట్లతో విమానం కొన్నారని విమర్శించారు వివేక్. తెలంగాణ ఖజానాను దోచుకునేందుకు కేసీఆర్ జీవిస్తున్నారని మండిపడ్డారు. రైతులకు, ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం మరిచారని అన్నారు. మేఘా కృష్ణారెడ్డి వంటి కాంట్రాక్టర్లను ప్రపంచంలోనే ధనికుడిని చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని విమర్శించారు.
ఇతర రాష్ట్రాల నుండి వచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న వారందరికీ తెలంగాణలో స్ధానం లేదన్నారు. పంజాబ్, గుజరాత్ ఎన్నికలలో నగదు అవసరమని కేజ్రీవాల్ తో మాట్లాడి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. 150 కోట్ల రూపాయలను కవిత ఆప్ గవర్నమెంట్ కు ఇచ్చారన్నారు. సిసోడియా ఎలాగైతే జైలుకు వెళ్లారో.. కవిత కూడా వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు.
లిక్కర్ స్కాంను ఢిల్లీ, పంజాబ్ లోనే కాకుండా దేశం అంతా చేయాలని అనుకున్నారన్నారు వివేక్. ఈ స్కాంలో ఎక్కువ మందిని అరెస్టు చేసే పరిస్ధితులు కనిపిస్తున్నాయని చెప్పారు.