సీఎం కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. అందుకే ప్రశాంత్ కిషోర్ నామ జపం చేస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోయిందన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అభిప్రాయపడ్డారు.
కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుని.. మొక్కులు తీర్చుకున్నారు వివేక్. ఆ తర్వాత ఆలయ అర్చకులు అందజేసిన స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
రాష్ట్ర ప్రజలు మంచి పరిపాలన కావాలని కోరుకుంటున్నారని అన్నారు. ప్రశాంత్ కిషోర్ ఒక పాగల్ అని నిండు సభలో చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు ఆయన చెప్పినట్టు ముందడుగు వేస్తున్నారని విమర్శించారు. పాగల్ గాన్ని వెంటేసుకు తిరుగుతున్నోడు ఏం అవుతాడో ప్రజలే అలోచించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రశాంత్ కిషోర్ ప్రధాని కావాలనుకుంటున్నారని విమర్శించిన కేసీఆరే.. అతని సాయం తీసుకుంటున్నారంటే నైతికంగా ఓటమిని అంగీకరించినట్టే అని విమర్శలు గుప్పించారు. అవినీతి, నియంతృత్వ కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయి ఉన్నారని పేర్కొన్నారు. అందుకే.. రాష్ట్రంలో జరుగుతున్న వరుస ఎన్నికల్లో బీజేపీకే పట్టం కడుతున్నారని వివరించారు వివేక్ వెంకట స్వామి.