కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐకి మరోసారి లేఖ రాశారు. విచారణకు హాజరయ్యేందుకు తనకు మరో పది రోజుల గడువు కావాలని లేఖలో కోరారు. ఆయన్ని సీబీఐ ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన లేఖపై సీబీఐ ఎలా స్పందించనుందనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి చుట్టూ ఇప్పటికే ఉచ్చు బిగుసుకు పోయింది. అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లి కోసం అవినాష్ రెడ్డి కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రిలో ఉన్నారు. ఆయన్ని ఆస్పత్రిలోనే అరెస్టు చేసేందుకు నిన్న సీబీఐ బృందం కర్నూలుకు వెళ్లినట్టు వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. కానీ ఆ పిటిషన్ ను విచారించేందుకు సుప్రంకోర్టు వెకేషన్ బెంచ్ నిరాకరించింది. ఈ విషయంలో మెన్షనింగ్ రిజిస్ట్రార్‌ను సంప్రదించాలని ఎంపీకి సుప్రీం కోర్టు సూచించింది. ఈ క్రమంలో ఆయన రేపు మరోమారు పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.
అవినాష్ రెడ్డిని ఏ క్షణంలోనైనా సీబీఐ అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి జిల్లా ఎస్పీకి సీబీఐ సమాచారం అందిచినట్టు తెలుస్తోంది. ఈ రోజు మధ్యాహ్నమే అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారని అంతా భావించారు. ఈ క్రమంలో సీబీఐకి అవినాష్ రెడ్డి లేఖ రాశారు.
తన తల్లి అనారోగ్యంతో ఉన్నారని, తండ్రి ఇదే కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారని చెప్పారు. దీంతో పాటు సుప్రీం కోర్టులో రేపు పిటీషన్ విచారణకు వచ్చే అవకాశం ఉండటాన్ని ఆయన లేఖలో ప్రస్తావించారు. తన తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యుల ఇచ్చిన నివేదికను కూడా లేఖతో పాటు పంపారు.
ఈ కారణాల వల్ల తనకు పది రోజుల సమయం కావాలని లేఖలో కోరారు. ఇక ఈ కేసులో ఇప్పటికే ఈ నెల 16,18 తేదీల్లో రెండు సార్లు విచారణకు హాజరు కాలేదు. ఈ విషయంలో అవినాష్ రెడ్డిపై సీబీఐ ఆగ్రహంతో వుంది. ఈ క్రమంలో ఆయన లేఖకు సీబీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి.