అర్ధరాత్రి వచ్చిన ఆపదతో కకావికలం అయిన విశాఖ గ్యాస్ లీకేజీ బాధితులను ఇంటికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు వైద్యులు. గ్యాస్ లీకేజి కారణంగా ఆసుపత్రి పాలై, కోలుకుంటున్న వారిని డిశ్చార్జ్ చేయబోతున్నారు. కొంత ఎక్కువగా గాలి పీల్చిన వారికి వారి ఆరోగ్య పరిస్థితులను బట్టి చికిత్స అందిస్తున్నారు.
విశాఖ శివారులోని ఆర్ ఆర్ వెంకటాపురంలో గల ఎల్జీ పాలిమర్స్ సంస్థలో స్టైరిన్ లీకేజీతో ఇప్పటికే 12మంది మృతి చెందగా, 5 గ్రామాల ప్రజలు కట్టుబట్టలతో బయటకొచ్చారు. దాదాపు 500మంది ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నారు.
అయితే… వారంతా ఇప్పుడు ఇంటికి వెళ్లాలంటే ఆందోళనలో ఉన్నారు. ఇంకా గాలిలో గ్యాస్ ఉంటే తమ పరిస్థితి ఏంటని, గ్యాస్ లీకేజీ కారణంగా కలుషితమైన గాలి, నీరు, పరిసరాల వల్ల తమకు భవిష్యత్ లో మరిన్ని ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉందని జనం భయపడుతున్నారు.
ఇక అక్కడ గ్యాస్ ఘాటుకు తట్టుకోలేక జీవరాశులు మరణించగా… పారిశుద్ధ్య సిబ్బంది వాటిని తొలగించారు. మాడిపోయిన చెట్లను తీసివేశారు. ఇక ప్రజలకు మనోధైర్యం కల్పించాలన్న ఉద్దేశంతో మంత్రులంతా ఈరోజు ఆ గ్రామాల్లోనే బస చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.