విశాఖపట్టణం వేదికగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఒక బూటకమని, అంకెల గారడీతో వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. సీ-పూడ్స్ ఎగుమతుల్లో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
కోడిగుడ్డును సీ-పూడ్స్‌లో కలిపి చూపడాన్ని బట్టి.. మంత్రులు ఎంత అవివేకంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. తాము ఇన్వెస్టర్లను తప్పు పట్టడం లేదని, వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నామన్నారు. గ్లోబల్ సమ్మిట్ పేరుతో 170 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
చిత్తశుద్ధితో పనులు చేస్తే..మెరుగైన పెట్టుబడులు వస్తాయని,అందుకు జనసేన పార్టీ మద్దతుగా ఉంటుందని అన్నారు.అంతకు ముందు ఆయన ఇప్పటం గ్రామంలో ఉదయం నుంచి విధ్వంసం సృష్టిస్తున్నారు. అధికార యాంత్రాంగం అన్యాయంగా కూల్చివేతలు చేస్తుందని పేర్కొన్నారు. జనసేన సభకు స్థలం ఇచ్చారన్న కక్షతో ఇళ్లు కూలుస్తున్నారని అన్నారు. నాలుగు వేల జనాభా ఉన్న గ్రామంలో 80 అడుగుల రోడ్డు వేస్తామని చెప్తున్నారు.
జనసేన పార్టీకి మద్దతుగా నిలిచారని వాళ్లను టార్గెట్ చేశారు. ముఖ్యమంత్రి తన అధికారంతో ఇప్పటం గ్రామంలో చిచ్చుపెట్టారు. గ్రామస్థులకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న జనసైనికులను అరెస్టు చేశారు. వాళ్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. జనసైనికులను విడుదల చేయగా పోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు.