విదేశాల్లో గన్ తో స్టోర్స్ లోకి వెళ్లి హల్ చల్ చేయడం తరచూ జరిగేవే. డబ్బుల కోసం బెదిరిస్తుంటారు దుండగులు. ఒక్కోసారి రెచ్చిపోయి కాల్పులకు తెగబడుతుంటారు. తాజాగా అమెరికాలో ఓ ఘటన జరిగింది.
విశాఖకు చెందిన చట్టూరి సత్యకృష్ణ అమెరికాలో దారుణ హత్యకు గురయ్యాడు. ఓ దుండగుడు అతడ్ని గన్ తో కాల్చి చంపేశాడు. నెలరోజుల క్రితమే ఉన్నత చదువుల కోసం సత్యకృష్ణ అమెరికాకు వెళ్లాడు.
ఓవైపు చదువుకుంటూనే ఇంకోవైపు అలబామాలోని పాత బర్మింగ్ హామ్ హైవేలోని క్రౌన్ సర్వీస్ స్టేషన్ లో స్టోర్ క్లర్క్ గా పనిచేస్తున్నాడు సత్యకృష్ణ. అయితే.. స్టోర్ లోకి దొంగతనానికి వచ్చిన దుండగుడు కాల్పులు జరపగా అక్కడికక్కడే మృతిచెందాడు.
అమెరికా అధికారులు సత్యకృష్ణ మృతిని ధృవీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. సత్యకృష్ణకు పెళ్లయింది. భార్య నిండు గర్భవతి. హత్యకు పాల్పడిన నిందితుడి ఫొటోను అమెరికా పోలీసులు విడుదల చేశారు.