బీజేపీ, జనసేన పార్టీలు ఏపీలో మిత్రపక్షాలుగా ముందుకు సాగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వంపై విమర్శల నుండి ఏ చిన్న ప్రొటెస్ట్ చేసినా ఉమ్మడిగానే ముందుకు సాగుతున్నారు. అందుకే త్వరలో జరగనున్నా తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల్లోనూ కలిసే పోటీచేయబోతున్నారు.
కానీ ఇటీవల జరిగిన కేంద్రమంత్రివర్గ సమావేశంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. కేంద్రానికి ఇది ఒక పరిశ్రమ మాత్రమే అయినా… ఆంధ్రులకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆత్మగౌరవ నినాదం. అందుకే కేంద్రం నిర్ణయంపై విమర్శలు మొదలయ్యాయి. కార్మికులు రోడ్డుపైకి వచ్చి… విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదిస్తున్నారు.
ఇప్పటికే బీజేపీ నేతృత్వంలోని మోడీ సర్కార్ పై ప్రత్యేక హోదా ఎగ్గొట్టారన్న ముద్ర ఉంది. కిందిస్థాయిలో బలంగా ఉన్న ఈ అసంతృప్తికి తోడు ఇప్పుడు విశాఖ ఉక్కు నినాదం కూడా తోడయ్యింది. దీంతో హుటాహుటిన జనసేన ప్రకటన ఇస్తూ… పవన్ స్వయంగా మోడిని కలుస్తారని, నిర్ణయం మార్చుకునే అవకాశం ఉందని తెలిపింది. కానీ బీజేపీ ఎంపీ సుజనా చౌదరి మాత్రం ఇది జరగకమానదు అన్నట్లుగా ప్రకటన ఇచ్చారు.
ఇప్పుడు ఈ విశాఖ ఉక్కు ఉద్యమం బీజేపీ-జనసేన కూటమి స్నేహాం మీద ప్రభావం చూపనుందని విశ్లేషణలు కొనసాగుతున్నాయి. రాష్ట్రస్థాయిలో రెండు పార్టీల నేతల మధ్య సఖ్యత లేకున్నా… కేంద్ర నాయకత్వం సూచనతో కలిసి నడుస్తున్నారు. కానీ ఈ ఉద్యమం తర్వాత పరిస్థితుల్లో చాలా మార్పులొస్తాయని సూచిస్తున్నారు.