నిజమే..నూటికో కోటికో..ఎక్కడో ఎప్పుడో తప్ప అలాంటి మాస్టార్లు ఉండరేమో. అందుకే బదిలీపై వెళ్తున్న ఆ సారు కోసం ఊరు ఊరంతా కదిలివచ్చింది. గిరిజన ప్రాంత పిల్లలకి ఎంతో శ్రద్ధగా విద్యా బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయుడిని ఘనంగా సత్కరించి.. సగౌరవంగా సాగనంపింది.
గ్రామ యువకులంతా కలిసి ఆ ఉపాధ్యాయుడిని భుజాలపై ఎత్తుకుని ఊరేగిస్తోంటే..వారి చుట్టూ చేరి పిల్లలు, మహిళలు.. చివరికి వృద్ధులు కూడా డాన్సులు చేస్తూ ఆయన వీడ్కోలు పలికారు. విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం మల్లుగూడ ప్రభుత్వ పాఠశాలకు చెందిన నరేంద్ర గౌడుకు దక్కిన అపూర్వ గౌరవం ఇది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
పదేళ్లుగా మల్లుగూడ ప్రభుత్వ పాఠశాలలో నరేంద్ర ఉపాధ్యాయుడిగా పాఠాలు బోధిస్తున్నారు. పాఠశాలలో ఎన్ని సమస్యలు ఉన్నా.. పిల్లలకు చక్కగా పాఠాలు చెప్పి గిరిజనుల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు ఆయన బదిలీ అవుతుండటంతో డప్పుచప్పుళ్లు, డాన్సుల మధ్య భుజాలపై ఎత్తుకొని ఇలా సాగనంపారు. కాగా ఈ ఆత్మీయ వీడ్కోలు కోసం గ్రామానికి చెందినవారంతా తలా ఇంత చందా వేసుకొని .. 30 వేల రూపాయలు ఖర్చుపెట్టారట. ఈ వీడియోని చూసినవారంతా ఆ ఊపాధ్యాయుడకి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేకపోతున్నారు.