తెలంగాణ కేడర్ ఐపీఎస్ అధికారి వీకే సింగ్ పంజాబ్ ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. ఆ రాష్ట్రంలో జైళ్ల ఆధునీకరణ, భద్రత పెంపునకు సంబంధించి ఆయన సేవలను వినియోగించుచుకోవాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇందుకు సంబంధించి జులై 9న పంజాబ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం తెలంగాణ డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేస్తున్న వీకేసింగ్.. అంతకుముందు తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా పనిచేశారు. అదే సమయంలో తన సేవలను తెలంగాణ ప్రభుత్వం గుర్తించడం లేదని, పదోన్నతి ఇవ్వడం లేదనే అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. స్వచ్చంద పదవీ విరమణ కోసం కేంద్రానికి దరఖాస్తు చేశారు. వీకే సింగ్ చర్యను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం..ఆయనను తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ పదవీ నుంచి తప్పించింది. ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. గతంలో జైళ్లశాఖ డీజీగా కూడా పనిచేసిన వీకేసింగ్.. అనేక సంస్కరణలు చేపట్టి మంచి పేరు తెచ్చుకున్నారు.