రష్యా పార్లమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశం వెలుపల సైనిక బలగాలను మోహరించేందుకు గాను అధ్యక్షుడు పుతిన్ కు అనుమతులను ఇచ్చింది. దీంతో ఉక్రెయిన్ పై దాడికి సైన్యాన్ని మోహరించడానికి పుతిన్ కు అధికారిక అనుమతి లభించింది.
అయితే సైన్యం మోహరింపునకు క్లియరెన్స్ కోరుతు పార్లమెంట్ సభ్యులకు పుతిన్ మంగళవారం లేఖ రాశారు. దీనిపై పార్లమెంట్ లో చర్చ జరిగింది. రష్యా ఎగువ సభ, ఫెడరేషన్ కౌన్సిల్ సభ్యులు ఈ చర్యకు అనుకూలంగా ఏకగ్రీవంగా ఓటు వేశారు.
ఉక్రెయిన్‌లోని డోనెస్ట్‌స్క్, లుహాన్స్‌క్‌లను స్వాతంత్ర దేశాలుగా గుర్తిస్తున్నట్టు రష్యా ప్రకటించిన మరుసటి రోజే ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. తూర్పు ఉక్రెయిన్‌లోని వేర్పాటువాద ప్రాంతాల్లో శాంతిని కొనసాగించేందుకుగాను ఆ ప్రాంతాలకు రష్యా సైన్యాన్ని పంపుతుందని పుతిన్ ప్రకటించారు.
అంతకుముందు మంగళవారం, యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఉక్రెయిన్ రాయబారి వాడిమ్ ప్రిస్టైకో మాట్లాడుతూ… ఇప్పటికే దండయాత్ర ప్రారంభమైందని మేము భావిస్తున్నాము. మేము మాట్లాడు తున్నట్టుగానే రష్యా దళాలు ఉక్రెయిన్ లోకి ప్రవేశిస్తున్నాయని అన్నారు.