హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచార పర్వం క్లైమాక్స్‌కు చేరడంతో.. ఇక ప్రలోభాల పర్వం మొదలైపోయింది. సమయం లేకపోవడంతో ఇక మాటలు చెప్పడం మానేసి.. నేరుగా నోట్ల కట్టలతో ఓటర్లని ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే రెడీ చేసిన క్యాష్ కవర్లను హోమ్ డెలివరీ చేసే పనిలో పడ్డాయి. అయితే ఈ విషయంలో అధికార టీఆర్ఎస్ ఓ అడుగు ముందే ఉంది. ఈటలతో పోటీ ఇజ్జత్ కా సవాల్‌గా మారడంతో ఓటుకు ఎంత రేటు అయినా కట్టేందుకు రెడీ అయిపోయింది. ఈ క్రమంలో ఓ ఓటరుకు క్యాష్ కవర్ అందిస్తున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి.
ఒక్క ఓటుకు 12 పచ్చనోట్లు.. అంటే రూ. 6 వేలు. జాగ్రత్తగా మడతబెట్టి వాటిని ఓ పేపర్ కవర్‌లో అందిస్తున్నారు హుజూరాబాద్‌లో అధికార టీఆర్ఎస్ నేతలు. క్యాష్ పట్టు.. కారు బటన్‌పై నొక్కు అంటూ చెప్పుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. అర్ధరాత్రి నుంచే ఈ ప్రలోభాల పర్వం జోరుగా సాగుతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల అధికారులు, పోలీసులు ఎంత నిఘా పెట్టినా.. ప్రయోజనమే లేకుండాపోయింది.