రాష్ట్రపతి పదవికి సోమవారం ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 10 గంటలకు ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. ఈ ఎన్నికలకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ ముగిసింది. పోలింగ్ సమయం ముగిసేసరికి 99.18శాతం ఓటింగ్ నమోదైంది.
వీల్ చైర్ లో మన్మోహన్, పీపీఈ కిట్ లో పన్నీరు సెల్వం.
రాష్ట్రపతి ఎన్నికల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసేందుకు ఆయన వీల్ చైర్ లో పార్లమెంట్ కు చేరుకున్నారు. వ్యక్తిగత సిబ్బంది సహాయంతో ఆయన ఓటు వేశారు. ఏఐఎండీకే నేత పన్నీరు సెల్వం కరోనాతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన పీపీఈ కిట్ లో వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
పలు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల ఓటింగ్
ఢిల్లీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 70 మందికి గాను 68 మంది ఓటు వేశారు. అసోంలో 126 మందికి గాను 119 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. పంజాబ్ లో 117కు 114 మంది ఓట్లు వేశారు. ఏపీలో 175,
ఓటింగ్ ను బైకాట్ చేసిన అకాళీదళ్ ఎమ్మెల్యే
రాష్ట్రపతి ఎన్నికలను బైకాట్ చేస్తున్నట్టు అకాళీదళ్ ఎమ్మెల్యే మన్ ప్రీత్ సింగ్ తెలిపారు. బీజేపీకి మద్దతు ప్రకటించే ముందు తనను తన పార్టీ సంప్రదించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సిక్కుల, పంజాబ్ లో సమస్యలను పరిష్కరించడంలో బీజేపీ విఫలమైనందున తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
క్రాస్ ఓటింగ్
రాష్ట్రపతి ఎన్నికల్లో తాను క్రాస్ ఓటింగ్ వేసినట్టు ఒడిశా కాంగ్రెస్ ఎమ్మెల్యే మహ్మద్ మకీమ్ తెలిపారు. తాను కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినప్పటికీ ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేసినట్టు చెప్పారు. తమ మనస్సాక్షి ప్రభోదనుసారం ఓటు వేసినట్టు తెలిపారు. మరోవైపు సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యే షాజిల్ ఇస్లాం అన్సారీ కూడా క్రాస్ ఓటింగ్ చేశారు. మేఘాలయాలో ఐదుగురు, అసోంలో 20 మంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటు వేశారు.
ఓటింగ్ కు దూరమైన ఎమ్మెల్యేలు…!
హజ్ యాత్రలో ఉన్నందున ముస్తాపాబాద్ ఎమ్మెల్యే హజీ యూనస్, జైళ్లో ఉన్నందున మంత్రి సత్యేంద్ర ప్రసాద్ జైన్ లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. ఎన్పీపీ ఎమ్మెల్యేలు అనిల్ దేశ్ ముఖ్, నవాబ్ మాలిక్ లు జైలులో ఉన్నందున ఓటు వేయలేకపోయారు.
రాజధానికి చేరుకుంటున్న బ్యాలెట్ బాక్స్ లు
రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ సాయంత్రం ఐదుగంటలకు ముగిసింది. దీంతో బ్యాలెట్ బాక్సులు పార్లమెంట్ కు చేరుకుంటున్నట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పీసీ మోడీ తెలిపారు. రాత్రి వరకు అన్ని బ్యాలెట్ బాక్సులు పార్లమెంట్ కు చేరుకుంటాయని ఆయన తెలిపారు.