తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఖాళీ అయిన అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు సోమవారం జరుగుతున్నాయి. తమిళనాడులో ఈరోడ్ ఈస్ట్ నియోజకవర్గానికి, అరుణాచల్ ప్రదేశ్ లో లుమ్లా, బెంగాల్ లో సాగర్దిగీ స్థానాల్లో అభ్యర్థుల మృతి కారణంగా వీటికి ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈరోడ్ ఈస్ట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే తిరుమహన్ ఎవేరా, లుమ్లా లో జాంబే తషి, సాగర్దిగి నియోజకవర్గంలో సుబ్రతా సాహా మృతి అనంతరం ఈ స్థానాలకు బై పోల్స్ నిర్వహిస్తున్నారు.
ఇక ఝార్ఖండ్ లో రామ్ గఢ్ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ఇక్కడ మమతా దేవిని శాసన సభ్యత్వానికి అనర్హురాలిగా ప్రకటించినందున ఉపఎన్నిక తప్పనిసరైంది. ముఖ్యంగా తమిళనాడు .. ఈరోడ్ ఈస్ట్ నియోజకవర్గంలో 77 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఈవీకె ఎస్ ఇలంగోవన్, అన్నా డీఎంకే అభ్యర్థి తెన్నారసు మధ్య ప్రధాన పోటీ ఉంది.
ఇలంగోవన్ కి డీఎంకే మద్దతునిస్తోంది. ప్రధానంగా ఈ ఉపఎన్నిక విపక్ష నేత ఎడప్పాడి కె. పళనిస్వామికి అగ్నిపరీక్షే.. 2.26 లక్షలమందికి పైగా ఓటర్లు ఈ ఉప ఎన్నికలో అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. ఈ నియోజకవర్గంలో 238 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెండున్నర వేలమందికి పైగా పోలీసులు బందోబస్తు డ్యూటీలో ఉన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా భావిస్తున్నవాటి వద్ద అదనపు పారా మిలిటరీ బలగాలను మోహరించారు.
ఈ నియోజకవర్గాల్లో పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది, సాయంత్రం 5 గంటలవరకు సాగుతుంది. ఈ ఉప ఎన్నికల ఫలితాలను మార్చి 2 న త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో బాటు ప్రకటిస్తారు.