– 5 గంటల వరకు 58.38 శాతం
– థారాడ్‌లో అత్యధికం, వెజల్పూర్ లో అత్యల్పం
-ప్రధాని పై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు
– ఓటు హక్కు వినియోగించుకున్న మోడీ తల్లి
– కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసిన ఇర్ఫాన్ పఠాన్, మోంగియా
-బనస్కాంత నియోజక వర్గంలో స్వల్ప ఘర్షణలు
– తనపై బీజేపీ నేతలు దాడి చేశారన్న కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 58.38 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం తెలిపింది. అత్యధికంగా థారాడ్ నియోజక వర్గంలో 78శాతం ఓటింగ్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.
వెజల్పూర్ నియోజక వర్గంలో అత్యల్పంగా 44.78 శాతం ఓటింగ్ నమోదైనట్టు అధికారులు పేర్కొన్నారు. మొత్తం 93 నియోజక వర్గాల్లో ఈ రోజు ఎన్నికలను నిర్వహించారు. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం అయింది. సాయంత్రం 5 గంటల వరకు లైన్లలో నిల్చున్న వారికి అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు.
జామ్ నగర్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి విశాల్ త్యాగీని గుజరాత్ యాంటి టెర్రరిస్ట్ స్వ్కాడ్ విభాగం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చీటింగ్ కేసులో ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు వివరాలు వెల్లడించారు.
ప్రధాని మోడీపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. అహ్మదాబాద్‌లో పోలింగ్ కేంద్రం వద్ద ఓటు హక్కును వినియోగించుకునే సమయంలో ప్రధాని మోడీ రోడ్ షో నిర్వహించారని ఎన్నికల సంఘానికి రాష్ట్ర కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ యోగేశ్ రావాని ఫిర్యాదు చేశారు.
ఈ ఎన్నికలో ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీమిండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి వడోదరాలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరో మాజీ క్రికెటర్ నయాన్ మోంగియా కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రధాని మోడీ తల్లి హీరాబాయ్ రాయ్ సన్ నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
బనస్కాంత నియోజక వర్గంలో తనపై బీజేపీ నేతలు తనపై దాడులు చేశారని కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కాంటి కరాడీ ఆరోపణలు చేశారు. ఆయుధాలతో వారు తనను వెంబడించి తనపై దాడి చేశారని ఆయన ఆరోపించారు. డాంటా నియోజక వర్గంలో బీజేపీ, కాంగ్రెస్ వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది.