తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏల ఆందోళన తారాస్థాయికి చేరింది. పేస్కేల్, వారసత్వ ఉద్యోగాల కోసం తెలంగాణ వ్యాప్తంగా వేల మంది వీఆర్ఏలు నిరసనల్లో పాల్గొంటున్నారు. తమ ఉద్యోగాలు ఉంటాయో, ఊడుతాయో తెలీడం లేదని వాపోతున్నారు. ఇంకోవైపు గత మూడు నెలలుగా తమకు జీతాలు ఇవ్వకపోవడంతో కుటుంబాలు పూట గడవడం కూడా కష్టంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వీఆర్ఏలు.సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ అమలు చేయమని అడుగుతున్నామే తప్ప.. మేమేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదని వీఆర్ఏలు పేర్కొన్నారు.
తాజాగా జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ చౌరస్తాలో మహిళా వీఆర్ఏలు ఆందోళన నిర్వహించారు. ఈ నిరసనకు పెద్ద ఎత్తున మహిళా వీఆర్ఏలు తరలి వచ్చారు. వారి నినాదాలతో ఆర్టీసీ క్రాస్ రోడ్ చౌరస్తా అంతా దద్దరిల్లిపోయింది.
వీఆర్ఏలకు పేస్కేల్ జీవోను విడుదల చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు వీఆర్ఏలు. సీనియర్ వీఆర్ఏలకు ప్రమోషన్లు ఇవ్వడంతో పాటు 50 సంవత్సరాల వయస్సు పూర్తి చేసుకున్న వీఆర్ఏల పిల్లలకు ఉద్యోగాలను ఇవ్వాలని కోరారు. మొదల ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బతుకమ్మ ఆడి తమ నిరసనను తెలియజేయాలనుకున్న వీఆర్ఏలు.. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఆర్టీసీ క్రాస్ రోడ్ చౌరస్తాలో ఆందోళన నిర్వహించారు.
అయితే విషయం తెలుసుకున్న పోలీసులు ఆర్టీసీ క్రాస్ రోడ్ చౌరస్తాలో నిరసనకు అనుమతి లేదని వెళ్లిపోవాలని కోరారు. అయినా వీఆర్ఏలు రోడ్డుపైనే బైఠాయించి సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిపై లాఠీఛార్జీ చేశారు. అనంతరం వీఆర్ఏలను అరెస్ట్ చేశారు.