ఉక్రెయిన్ లో చిక్కుకున్న చైనీయులను స్వదేశానికి తరలించడంపై చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. ఉక్రెయిన్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు తరలింపు ప్రక్రియకు అనుకూలంగా లేవని తెలిపింది.
‘ తరలింపు ప్రక్రియ మొదలు పెట్టేముందు సురక్షితమైన వాతావరణం ఉందో లేదో చూసుకోవాలి. ఇక్కడ సురక్షితమైన వాతావరణం ఉన్నంత వరకు, ప్రతి ఒక్కరి భద్రతకు హామీ ఉన్నంత వరకు మేము తగిన ఏర్పాట్లను చేస్తాము” అని ఉక్రెయిన్ లో చైనా రాయబారి ఫాన్ జియాన్ రోంగ్ అన్నారు.
ఉక్రెయిన్ రాజధాని కైవ్ నుంచి తాను వెళ్లిపోయినట్టు వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. ‘ గత కొన్ని రోజులుగా, అందరిలాగే మేము కూడా సైరన్లు, తుపాకి శబ్దాలు, బాంబుల మోతలు వింటున్నాము. మేము పదేపదే బేస్ మెంట్లలో దాక్కుంటున్నాము. ఇలాంటి సీన్లు మేము గతంలో సినిమాల్లో మాత్రమే చూసేవాళ్లం. ఇప్పుడు రియల్ గా చూస్తున్నాము” అని తెలిపారు.
ఉక్రెయిన్ లో స్థానికులకు, చైనా పౌరులకు మధ్య ప్రతికూలత పెరుగుతోందని ఇటీవల వార్తలు వస్తున్నాయి. దీనిపై ఆయన మాట్లాడుతూ… స్థానికులతో గొడవలు పెట్టుకోవద్దని చైనా పౌరులకు ఆయన సూచించారు.
ఉక్రెయిన్ ప్రజలు ఇప్పుడు క్లిష్టపరిస్థితుల్లో ఉన్నారని తెలిపారు. వారు ప్రస్తుతం ఎన్నో బాధలను ఎదుర్కొంటున్నారని, వారి ఫీలింగ్స్ ను మనం అర్థం చేసుకోవాలని చైనా పౌరులకు సూచించారు.