చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా టైటిల్ మోషన్ టీజర్ రిలీజైంది. యూట్యూబ్ లో ఈ వీడియో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ టీజర్ తో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే వాళ్ల కంటే ఎక్కువగా మరో సినిమా యూనిట్ పండగ చేసుకుంటోంది. దీనికి ఓ బలమైన కారణం ఉంది.
సంతోష్ శోభన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. లైక్-షేర్-సబ్ స్క్రైబ్ అనేది ఈ సినిమా టైటిల్. ఇక వాల్తేరు వీరయ్య టైటిల్ టీజర్ చివర్లో, చిరంజీవి చెప్పే డైలాగ్ కూడా లైక్-షేర్-సబ్ స్క్రైబ్. ఇలా తమ సినిమా టైటిల్ ను డైలాగ్ రూపంలో చిరంజీవి చెప్పడంతో.. సంతోష్ శోభన్ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.
టీజర్ నుంచి చిరంజీవి చెప్పిన ఆ డైలాగ్ ను కట్ చేసి, ఇప్పటికే ప్రమోషన్ స్టార్ట్ చేసింది లైక్-షేర్-సబ్ స్క్రైబ్ యూనిట్. నవంబర్ 4న ఈ సినిమాను విడుదలకు సిద్ధం చేశారు. సరిగ్గా విడుదలకు 2 వారాల ముందు ఇలా చిరంజీవి డైలాగ్ తమకు కలిసిరావడం తమకు దక్కిన వరమని ప్రకటించాడు సంతోష్ శోభన్.
ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రయిలర్ ను విడుదల చేశారు. ప్రభాస్ చేతుల మీదుగా ఈ ట్రయిలర్ లాంచ్ అయింది.