వీరసింహారెడ్డి.. బాలయ్య నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా. వాల్తేరు వీరయ్య.. చిరంజీవి నటిస్తున్న మెగా మూవీ. వారసుడు.. తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న సినిమా. ఈ 3 సినిమాలు వేటికవే పెద్దవి. దేన్నీ తక్కువచేసి చూడ్డానికి వీల్లేదు. అయితే నిడివి పరంగా మాత్రం వీటిలో ఒక పెద్ద సినిమా ఉంది. అదే వాల్తేరు వీరయ్య.
అవును.. చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య రన్ టైమ్ పెద్దది. ఈ సినిమా నిడివి దాదాపు 2 గంటల 40 నిమిషాలుంది. తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తవ్వడంతో ఈ మేటర్ బయటకొచ్చింది. చిరంజీవి సినిమా ఇంత పెద్దగా మారడానికి కారణం రవితేజ.
ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించాడు రవితేజ. సెకండాఫ్ లో ఇతడి పాత్ర చాలా ఎమోషనల్ గా సాగుతుందట. పైగా దానికి సంబంధించిన సన్నివేశాలన్నీ చాలా బాగా వచ్చాయంట. అలా రవితేజ నిడివి పెరిగింది. ఫలితంగా రన్ టైమ్ ఎక్కువైంది.
దర్శకుడు బాబి కూడా ఎడిట్ చేయడానికి ఇష్టపడలేదంట. ఫ్లో చాలా బాగుందని, 2 గంటల 40 నిమిషాల నిడివి పెద్ద సమస్య కాదని యూనిట్ కూడా ఫీల్ అయినట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా చిరంజీవి ఆమోదముద్ర కూడా పడిన తర్వాతే సెన్సార్ కు పంపించారు.