– కోట్ల విలువైన ఎండోమెంట్ ల్యాండ్
– హైదరబాద్ భూముల కంటే కాస్ట్లీ
– పట్టణం నడిబొడ్డున మూడున్నర ఎకరాలు
– రేటు రూ.300 కోట్ల పైమాటే..!
– అక్షరాలా గజం రూ.1.5 లక్షలు..!
– కన్నేసిన గులాబీలు.. కబ్జాకు ప్రణాళికలు
– ఇష్టానుసారంగా ఉత్తర్వులు..?
– అడ్డగోలు వ్యవహారాలు..!
– మౌనంగా ప్రతిపక్ష లీడర్లు..!
క్రైంబ్యూరో, తొలివెలుగు:హైదరాబాద్ కు 155 కిలోమీటర్ల దూరం. అయినా కూడా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ రేంజ్ లో అక్కడి ల్యాండ్ ధర పలుకుతోంది. వనపర్తి నడిబొడ్డున ఉన్న దేవాదాయ శాఖ భూమి అది. మరి.. అంత కాస్ట్లీ అంటే గులాబీలు ఊరుకుంటారా ఏంటి? దేవుడి భూమే కదా.. మంత్రిగా ఉన్నప్పుడే బినామీలతో ఎలాగైనా స్వాధీనం చేసుకుని వందల కోట్లు గడించాలనుకున్నారు. ఇంకేముంది గులాబీ నోట్ల మత్తులో అధికారులు హైకోర్టులో స్టే కొనసాగుతుండగానే.. పది రోజుల వ్యవధిలోనే ఓఆర్సీ వచ్చింది. పట్టా పాస్ బుక్ లు ప్రింటయ్యాయి. మున్సిపాల్టీ నుంచి లే అవుట్ పర్మిషన్ కూడా వచ్చింది. మంత్రిగా ఉంటే ఆ పవర్ ఎలా ఉంటుందో చూపించారని బహిరంగానే ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ భూములను కాపాడేందుకు ప్రశ్నించేవాడు లేకపోవడం.. ప్రతిపక్షాలు నిద్రమత్తులో ఉండటంతో మంత్రిగారి బినామీ దందా యమ స్పీడ్ మీదుందని చెబుతున్నారు ప్రజలు.
భూమిని ఎండోమెంట్ కి ఇచ్చేందుకు కారణం ఇదే..?
వనపర్తి సంస్థానాధీశులు రాజా రామేశ్వర్ రావు ఎండోమెంట్ చైర్మన్ గా ఉండేవారు. అయితే వనపర్తి నడిబొడ్డున భూమిని కొనుగోలు చేసి పేదలకు అవసరమయ్యే విధంగా ఉంచాలనుకున్నారు. అందుకు ఎండోమెంట్ డిపార్ట్ మెంట్ కి భూమి ఇస్తే సేఫ్ గా ఉంటుందని భావించారు. 1968 జనవరి 5న మూడెకరాల 20 గుంటల భూమిని అరే రామారావు, నారాయణరావు, అహల్య భాయ్ దగ్గర నుంచి కొనుగోలు చేసి సెక్షన్ 43 ప్రకారం 1971లో డీ/4507 ఫైల్ తో ఎండోమెంట్ భూమిగా రాటిఫికేషన్ చేయించారు. అప్పటి నుంచి ఎండోమెంట్ భూమిగా ఇది కొనసాగుతోంది. తక్కువ ధరకి పేదవారికి ఆ భూమిని అద్దెకు ఇచ్చేందుకు ఉపయోగపడటం, బ్రహ్మణ కుటుంబాలు ఉండేందుకు నిర్మాణాలు చేయాలనే ఉద్దేశంతో దాన్ని ఎండోమెంట్ కి ఇచ్చారు. అయితే.. చైర్మన్ హోదాలో ఉండి భూమిని కొనుగోలు చేయడం.. మళ్లీ ఎండో మెంట్ కి ఇస్తున్నట్లు ప్రొసీడింగ్ చేయడంతో దానిపై కొందరి కన్ను పడింది.
ఇలా వివాదాస్పదమైంది..?
మనోజీరావు అనే వ్యక్తి 1996లో ఈ భూమి హక్కుదారుడినంటూ ఓనర్ షిప్ రైట్ కల్పించాలని గద్వాల్ సబ్ కలెక్టర్ కి అప్లికేషన్ పెట్టుకున్నాడు. అందుకు రాజావారి కుటుంబం అభ్యంతరం తెలిపింది. రాజా రామేశ్వర్ రావుకి అమ్మిన ఓనర్స్ ఇంప్లిడ్ అయి వాదనలు వినిపించారు. ఇలా హైకోర్టులో సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్, కలెక్టర్స్, సబ్ కలెక్టర్స్ చుట్టూ తిరిగింది ఈ కేసు. అయితే.. 2010లో మనోజీరావుకి వనపర్తి ఆర్డీవో ఓఆర్సీ ఇచ్చారు. దానిపై జాయింట్ కలెక్టర్ కి అప్పీల్ కి వెళ్లారు. తర్వాత ఓఆర్సీ రద్దు చేసి రాజా రామేశ్వర్ రావుకు అమ్మిన 8 మంది కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగింది. ఈ ఆర్డర్ పైనా 2013లో గ్రూప్ టెంపుల్ వనపర్తి, మహాబూబ్ నగర్ జాయింట్ కలెక్టర్ దగ్గర మళ్లీ అప్పీల్ వేశారు. ఇందులో అప్పాజీరావు, అజయ్ కుమార్, సయ్యద్ షాబుద్దీన్ ల సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత 2015లో కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టులో రిట్ పిటిషన్ ఫుల్ బెంచ్ వద్ద పెండింగ్ లో ఉండగా ఓనర్ షిప్ రైట్స్ ఇనాందారులకు, కొనుగోలు చేసిన ఎండో మెంట్ వారికి ఎవ్వరికి ఇచ్చినా.. చట్టప్రకారం సబ్ జూడీషియల్ అవుతుందని ఆర్డీఓ అప్పీల్ పై ఎటూ తేల్చకుండానే ఉత్తర్వులు ఇచ్చారు.
జిల్లా ఏర్పాటు కావడంతో ఉపందుకున్న కబ్జా వ్యవహారం
1996 నుంచి వివాదంలో ఉన్న ప్రైం ఏరియాపై టీఆర్ఎస్ నేతల కన్ను పడింది. కానీ.. అప్పుడు ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి ఉండడం.. కోర్టులో తుది తీర్పు వచ్చేంత వరకు ఎవరూ కబ్జాలకి వెళ్లవద్దని హెచ్చరించడంతో అంతా సైలెంట్ గా ఉండిపోయారు. కానీ.. 2018 ఎలక్షన్స్ లో టీఆర్ఎస్ నేత ఎమ్మెల్యే కావడం.. మంత్రిగా పనిచేస్తుండటంతో కళ్ల ముందున్న రూ.300 కోట్ల వివాదాస్పాద భూమిని ఖతం చేసేలా ప్రయత్నాలు మొదలు పెట్టారు. హైకోర్టులో కేసు ఉందని తెలిసి కూడా.. జాయింట్ కలెక్టర్ అప్పీల్ కేసుని 2019 జూలై 20న రీ ఓపెన్ చేయించారు. ఈవో గ్రూప్ ఆఫ్ టెంపుల్, ప్రతివాదులు అందరూ.. హైకోర్టులో పెండింగ్ లో ఉన్నందున విచారణకు హాజరు కాలేదు. మూడో నోటీస్ కి హాజరైన న్యాయవాదులు హైకోర్టులో ఉన్న స్టేటస్ కోని ప్రస్తావించారు. అయితే.. ఎండోమెంట్ న్యాయవాది మాత్రం ఎలాంటి వాదనలు చేయలేదు. కానీ.. జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ అక్టోబర్ 31న తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు తర్వాత 18 రోజులు జేసీ అందుబాటులో లేకుండా సెలువులోకి వెళ్లారు. తీర్పు కాపీని ఇవ్వడానికి నెలల సమయం పట్టింది. అప్పటి కలెక్టర్ శ్వేత మహంతి ఒత్తిళ్లను తట్టుకోలేక అంతా జేసీకి అప్పగించి.. తనను బదిలీ చేయాలని మొరపెట్టుకున్నట్లు తెలిసింది. ఆ తర్వాత హైదరాబాద్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారని వనపర్తి వాసులు చెప్పుకుంటున్నారు. ఎండోమెంట్ అధికారులు జేసీ తీర్పుపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. నెంబర్ 2722/2019పై హైకోర్టు స్టే విధిస్తూ విచారణ వాయిదా వేసింది.
హైకోర్టు స్టే.. మాకు వర్తించదంటున్న వనపర్తి అధికారులు
జేసీ వేణుగోపాల్ ఇచ్చిన ఉత్తర్వులపై డిసెంబర్ 10, 2019న స్టే ఇచ్చింది ఉన్నత న్యాయస్థానం. ఇదే విషయాన్ని అధికారులందరికీ లెటర్స్ రాశారు. కానీ.. మంత్రి బినామీ అని చెప్పుకుంటున్ననీలం గౌడ్ 2020 ఫిబ్రవరిలో భూమిని కబ్జా చేసి చదును చేశాడు. అప్పటికే స్టే వచ్చిన విషయం తెలిసినా.. సబ్ రిజిస్ట్రర్ రిజిస్ట్రేషన్ చేశారు. ఎమ్మార్వో అదే రోజు ధరణిలో అప్ డేట్ కూడా చేశారు. పూర్తి కమర్షియల్ భూమి అయినా కూడా.. ధరణిలో మాత్రం ఎక్కడ అనుమానం రాకుండా లీగల్ గా చేసుకున్నారు. అవే డ్యాక్యుమెంట్లతో నాలా పర్మిషన్ కోసం ఆర్డీవో వద్దకు వెళ్లారు. స్టే ఉన్నందన ఇవ్వలేమని రిజెక్ట్ అయింది. దీంతో అప్పటి ఆర్డీవో చంద్రారెడ్డిని మూడు రోజుల్లో బదిలీ చేయించారు. ఎకరం 6 గుంటల భూమిపై ఎవరు రావొద్దని నీలం గౌడ్ మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నారు. మెయిన్ రిట్ పిటిషన్ లో స్టే ఉండగా.. ఐఏ పై ఇంజక్షన్ అర్డర్ ఎలా ఇస్తారని ప్రత్యర్ధులు కౌంటర్ దాఖలు చేశారు. దీంతో ఆ ఐఏని విత్ డ్రా చేసుకుంటున్నట్లు నీలంగౌడ్ చెబుతున్నారు. ఐఏ విత్ డ్రా చేసుకుంటునే అదే విలువ లేని మధ్యంతర ఉత్తర్వులతో అధికారుల వద్ద నుంచి అనుమతులు తెచ్చుకున్నారు.
ఎకరంతో మూడున్నర ఎకరాలు కబ్జా!
ఎకరం 6 గుంటల భూమి నీలం గౌడ్ పేరు మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసి ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దానికి లే అవుట్ అనుమతుల కోసం అప్లయి చేసుకున్నారు. అయితే.. మున్సిపల్ అధికారులు మంత్రి ఒత్తిడితో మూడు రోజుల్లోనే ఇచ్చేశారని విమర్శలు ఉన్నాయి. దీంతో ఎక్కడిక్కడ గోడలు నిర్మించి అక్రమ లే అవుట్ ద్వారా గజం రూ.1.5 లక్షలకు అమ్మకం జరుపుతున్నారు. అయితే ప్రశ్నించేందుకు వెళ్లిన ఎండోమెంట్ అధికారులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారని తెలుస్తోంది.
బినామీల పర్వం
తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు అయితే వంద ఎకరాలకు తక్కువ కాకుండా భూములు కొనుగోలు చేసి పెట్టుకున్నారు.. మంత్రులు వేల కోట్లకు బినామీలతో పడగలెత్తారని విమర్శలు ఉన్నాయి. ఇందుకు ఎన్నో ఉదాహరణలు తొలివెలుగు క్రైంబ్యూరో దగ్గర ఉన్నాయి. రాష్ట్రంలోనే అత్యంత పేరుగాంచిన, పెబ్బెర్..సంతలోని 34 ఎకరాలను కబ్జా చేసేందుకు కుట్రలు పన్నారు. జల్లాపూర్ లో 100 ఎకరాల్లో అక్రమ క్రషర్ యూనిట్స్, ఓ అధికారి, నేతల అడుగులకు మడుగులు ఒత్తినందుకు 2 కోట్లు పెట్టి వనపర్తిలో నాలుగెకరాల భూమి కొనుగోలు చేసి మిల్లు నిర్మించి బావమర్ధికి ఇచ్చారని ఆరోపణలున్నాయి. ఇక వందల ఎకరాల భూములు, రెండు భారీ ఆయిల్ మిల్లులు, ఎకరాల్లో ఇళ్లు, ఒకటి కాదు రెండు కాదు.. మూడేళ్లు మంత్రిగా చేస్తే 50 కోట్ల ఆస్తుల నుంచి 800 కోట్ల ఆస్తిపరులుగా అయ్యారని వనపర్తిలో ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఇవ్వన్నీ రుజువు కావాలంటే కేంద్రం ప్రవేశపెట్టిన బినామీ యాక్ట్ తో దర్యాప్తు జరిపించాలని వేడుకుంటున్నారు. తొలివెలుగు క్రైంబ్యూరో కూడా అధికారులను గులాబీ నోట్ల మత్తులో ఉంచి ధరణి పేరుతో వందల ఎకరాలను దొచుకొని.. ఒక్కొక్క జిల్లాలో నాయకులు ఎలాంటి దందాలు చేస్తున్నారో ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తోంది.
లిటిగేషన్ ప్లాట్స్ కొనే ప్రజలకు విజ్ఞప్తి
హైకోర్టులో స్టే ఉండగా అధికారులతో కుమ్మకై నాలా పర్మిషన్ తీసుకొని టెంటివ్ లే అవుట్ పర్మిషన్ తీసుకున్నారు. సబ్ రిజిస్ట్రర్ ని ఏమార్చి రిజిస్ట్రేషన్ చేపించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆ భూమి మీకు హక్కుగా బదిలీ కాదు. రిట్ పిటిషన్ నెంబర్ 12827/2020 హైకోర్టు స్పష్టంగా ఉత్తర్వులు జారీ చేసింది. స్టే వెకెంట్ అయ్యేంత వరకు ఎలాంటి లావాదేవీలు జరపరాదని అదేశాలు ఇచ్చింది. మంత్రి అండదండలతోనే లేక లంచాలకు అలవాటు పడి అమ్మకం జరిపినా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. 2002 నుంచి ఎన్నో కేసుల్లో స్టేటస్ కో ఆర్డర్స్ ఉన్నాయి. కానీ.. అవేమి మీకు చెప్పకుండానే రూ.2 లక్షల గజం జాగా రూ.1.5 లక్షలకు వస్తుందని ఆశ చూపించి అమ్మే ప్రయత్నాలు చేస్తున్నారు. వనపర్తి ప్రజలు తస్మాత్ జాగ్రత్త.