రాష్ట్రంలో మదర్శాల సంఖ్యను తగ్గించాలనుకుంటున్నట్టు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు. మొదటిదశలో వీటి సంఖ్యను తగ్గిస్తామని, వీటికి రిజిస్ట్రేషన్ సిస్టం అమలును ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. అంటే వీటిలో ఇక ఇతర స్కూళ్లలో మాదిరే సాధారణ విద్యను కూడా బోధించడానికి చర్యలు తీసుకుంటామని పరోక్షంగా తెలిపారు. ఈ విషయమై ముస్లిం సంఘాలు , ముస్లిం మత గురువులతో సంప్రదిస్తున్నామని, వారు కూడా ప్రభుత్వానికి సహకరిస్తున్నారని ఆయన చెప్పారు.
ముస్లిం ర్యాడికలిజాన్ని వ్యాప్తి చెందింపజేసేందుకు చిన్న తరహా మదర్సాలను వినియోగించుకుంటున్న వైనం తమ దృష్టికి వచ్చిందని, ఈ ముప్పును తగ్గించడానికి వీటిని పెద్ద మదర్సాలలో విలీనం చేస్తామని ఆయన అన్నారు మదర్సాలను సంస్కరించాలని తమ ప్రభుత్వం భావిస్తోందన్నారు. రాష్ట్రంలో ఇలాంటి అన్ని సంస్థలకు సంబంధించిన డేటా బేస్ ను రూపొందించడానికి సర్వే నిర్వహిస్తున్నామని శర్మ తెలిపారు.
అస్సాంలో ముస్లిం జనాభా సులభంగా ర్యాడికలైజేషన్ (తీవ్రవాద పోకడలు) వైపు మొగ్గే ప్రమాదం ఉందని, కొందరు దీన్ని వ్యాప్తి చెందింపజేయడానికి చిన్న మదర్సాలను ఉపయోగించుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ‘అన్సరుల్ బంగ్లా టీమ్’,’అల్ ఖైదా ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్’ అనే ఉగ్రవాద తరహా సంస్థలకు సంబంధించిన 9 విభాగాలను పోలీసులు కనుగొన్నారని, గత ఏడాది 53 మంది అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారని ఆయన చెప్పారు. ఇలాంటి పోకడలను మొగ్గలోనే తుంచి వేయాలనుకుంటున్నామన్నారు.
బంగ్లాదేశ్ లో ఇలాంటి సంస్థలను నిషేధించడంతో వాటికి చెందిన కొంతమంది టాప్ లీడర్లు తమ స్థావరాలను అస్సాం, యూపీ వంటి రాష్ట్రాలకు మార్చుకుని.. యువతను ఉగ్రవాదం వైపు ప్రోత్సహిస్తున్నారని డీజీపీ భాస్కర్ జ్యోతి మహంత కూడా వెల్లడించారు.ఈ కారణం వల్లే మొదట మదర్సాలను ప్రభుత్వం సంస్కరించాలనుకుంటున్నదని అన్నారు.