పాకిస్థాన్, భారతదేశాలకు చెందిన ప్రజలు శాంతియుతంగా జీవించాలని కోరుకుంటున్నారని నోబెల్ అవార్డు గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ అన్నారు. రెండు దేశాలు మంచి స్నేహితులుగా మారాలని తాను కోరుకుంటున్నానని మలాలా అన్నారు. ఆమె తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఆ విధంగా వ్యాఖ్యలు చేశారు.
పాకిస్తాన్, భారతదేశం.. ఇతర ఏ దేశం అయినా మైనారిటీలకు ప్రతి దేశంలో రక్షణ అవసరమని ఆమె అన్నారు. ఈ సమస్య మతానికి సంబంధించినది కాదని, కానీ అధికార దుర్వినియోగానికి పాల్పడడాన్ని తీవ్రంగా పరిగణించాలని ఆమె అన్నారు. బాలికలకు విద్యను అందించేందుకు పోరాటం చేసిన మలాలా 2012లో అక్టోబర్ నెలలో తాలిబాన్ల దాడిలో తలకు బుల్లెట్ గాయం తగిలి అనూహ్యంగా ప్రమాదం నుంచి బయట పడ్డారు. ఈ సందర్భంగా ఆమెను నోబెల్ అవార్డు కూడా వరించింది.
అయితే భారతదేశంలో రైతులు శాంతియుతంగానే నిరసనలు చేస్తున్నప్పటికీ ఇంటర్నెట్ షట్ డౌన్, కార్యకర్తల అరెస్టు వంటి విషయాలు ఆందోళనకు గురి చేస్తున్నాయని అన్నారు.
భారత్, పాకిస్థాన్ దేశాలు మంచి స్నేహితుల్లా ఉండాలి. ఒకరి దేశాన్ని మరొకరు సందర్శించాలి. పాకిస్థాన్ సినిమాలను ఇండియన్లు చూడాలి. బాలీవుడ్ మూవీలను పాకిస్థానీయులు చూడాలి. అందరూ క్రికెట్, సినిమాలను ఎంజాయ్ చేయాలి.. అని మలాలా అన్నారు.
జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ (జేఎల్ఎఫ్)లో భాగంగా వర్చువల్ మోడ్‌లో పాల్గొన్న ఆమె తన పుస్తకం I Am Malala: The Story of the Girl Who Stood Up for Education and was Shot by the Taliban పై కూడా మాట్లాడారు.
భారత్, పాకిస్థాన్ దేశాల ప్రజలు బాగానే ఉంటున్నారని, మధ్యలో ఈ అడ్డుగోడలు ఎందుకని ప్రశ్నించారు. శాంతితో జీవనం సాగించాలని అన్నారు. భారత్, పాక్ దేశాలు ఒక దేశానికి మరొక దేశం శత్రువు కాదని, అసలు శత్రువులు పేదరికం, వివక్ష, అసమానతలే అని.. ఇరు దేశాలు ముందు వాటిని పారదోలేందుకు కృషి చేయాలని అన్నారు. ప్రతి బాలికకు విద్య అందాలన్నదే తన లక్ష్యమని తెలిపారు.