జీఎస్ఆర్ టీవీ తెలుగు డైరెక్టర్ గుండ శివరామిరెడ్డిని తక్షణమే విడుదల చేయాలని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ డిమాండ్ చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయి.. నిధులు నియామాకాల్లో తమ వాటా తమకు ఉంటదనుకున్న రాష్ట్ర ప్రజలకు కేసులు మిగిలాయని ఆరోపించింది.
రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను ప్రజలకు విప్పిచెపుతున్న మీడియాను.. మీడియా ప్రతినిధులను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని జేఏసీ నాయకులు మండిపడ్డారు. హుజూర్ నగర్ పోడు భూముల విషయంలో ప్రశ్నించినందుకు గతంలో తొలివెలుగు రఘును అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు.
విద్యార్దుల సమస్యల గురించి నిలదీసిన పాపానికి ఓయూ విద్యార్ధి నాయకుడు మహిపాల్ యాదవ్ అక్రమంగా నిర్భందించారని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవ్వరు మాట్లాడితే వాళ్ళను జైల్లో పెట్టడం కేసీఆర్ కు అలవాటుగా మారిందని మండిపడ్డారు.
మీడియాపై అక్రమ కేసులను ఆపాలని.. అక్రమంగా అరెస్ట్ చేసిన గుండ శివరామిరెడ్డిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే విద్యార్థి జేఏసీ పక్షాన ప్రభుత్వంపై ఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చరించారు.