ప్రపంచ వ్యాప్తంగా ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతోన్న యుద్ధం హాట్ టాపిక్‌గా మారింది. రష్యా దాడులపై ఐక్యరాజ్యసమితిలో భారత్ కీలక వ్యాఖ్యలు చేసింది. రష్యా, ఉక్రెయిన్ ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేసిన భారత్.. శాంతి భద్రతలకు విఘాతం కలిగి రెండు దేశాలు పెను సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఉక్రెయిన్ నుంచి విడిపోయిన ప్రాంతాలైన డొనెట్స్క్ , లుహాన్స్క్‌లలో రష్యా సైన్యం దాడులకు దిగిన నేపథ్యంలో ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి ఈ ప్రకటన చేశారు.
కానీ.. ఇప్పటివరకు భారత్ ఈ యుద్ధంపై ఎటువంటి స్టేట్ మెంట్ చేయలేదు. తన మద్దతును కానీ.. స్టాండ్స్‌పై కానీ ప్రకటనలు చేయలేదు. కానీ.. తాజాగా కేంద్ర మంత్రి రంజన్ సింగ్ స్పందించారు. ఈ యుద్ధం విషయంలో భారత వైఖరిని ఆయన తెలిపారు. ఈ యుద్ధానికి శాంతియుత పరిష్కారం కావాలని కోరుకుంటున్నామని రంజన్ సింగ్ తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధంలో తమ స్టాండ్ న్యూట్రల్ అని రంజన్ సింగ్ తేల్చి చెప్పారు.
మరోవైపు దేశంలో చొరబడి రష్యా సైనికులు చేస్తున్న విధ్వంసంతో ఉక్రెయిన్ పౌరులు ఉక్కిబిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్ లోని పలు కీలక నగరాల్లో పాగా వేసిన రష్యన్ సైనికులు.. బాంబు దాడులకు పాల్పడుతూ విధ్వంసం సృష్టిస్తున్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రపంచ దేశాల మద్దతు కోరింది. రష్యా దుశ్చర్యను ఖండించాలని పిలుపునిచ్చింది. దీనికి స్పందించిన బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు ఉక్రెయిన్ కు మద్దతు ప్రకటించాయి. ఆర్థిక, రక్షణ, సామాగ్రి పరంగా ఉక్రెయిన్ దేశానికి సహకరిస్తామని ఫ్రాన్స్ ప్రకటించింది.