హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడో తెలియదు గానీ.. నాయకుల మధ్య డైలాగ్ వార్ మామూలుగా లేదు. ముఖ్యంగా మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. అయితే హరీష్ రావు కాస్త ఓవరాక్షన్ చేస్తున్నారని అంటున్నాయి బీసీ వర్గాలు. ఆయన మాట్లాడితే వాదం.. ఈటల చెప్పేది సెంటిమెంట్ అన్నట్లుగా మాట్లాడుతున్నారని మండిపడుతున్నాయి. ఆత్మగౌరవం అంటే హరీష్ కు నవ్వులాటలా కనపడుతోందని.. ఈవిధంగా తన దొరతనాన్ని ఆయన బయట పెట్టుకుంటున్నారని అంటున్నాయి.
ప్రచారంలో భాగంగా తెలంగాణ సమాజం ఆకలినైనా భరిస్తుంది కానీ.. ఆత్మగౌరవాన్ని వదులుకోదు అంటూ ఈటల మాట్లాడుతున్నారు. కానీ.. ఈ వ్యాఖ్యలు హరీష్ కు సెంటిమెంట్ లా కనపడ్డాయా అని ప్రశ్నిస్తున్నాయి బీసీ సంఘాలు. దొరలకు ఇతరుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే తెలుసని.. హరీష్ పై ఘాటైన వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నాయి. సెంటిమెంట్ ను వాడుకొని రాజకీయంగా లాభపడడం దొరలకే తెలుసని… తమకు తెలిసిందంతా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం, దానికోసం రాజీలేకుండా పోరాటం చేయడమేనని కౌంటర్ ఇస్తున్నాయి. తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకొని కేసీఆర్ లాభపడింది నిజం కాదా.. కల్వకుంట్ల కుటుంబం బాగు పడింది వాస్తవం కాదా..? అని నిలదీస్తున్నాయి. ఒకప్పుడు కేసీఆర్ కుటుంబం ఆస్తులు ఎంతుండేవో.. ఇప్పుడు ఎంత ఉన్నాయో..? సీబీఐ విచారణ చేస్తే సెంటిమెంట్ ను వాడుకొని ఎన్ని వేల కోట్లు సంపాదించారో తేలుతుందని అంటున్నాయి. తెలంగాణ వాదాన్ని అడ్డం పెట్టుకొని పదవులు, పైసలు సంపాదించుకున్న కేసీఆర్, హరీష్ రావు.. ఈటెలపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని కౌంటర్ ఇస్తున్నాయి బీసీ వర్గాలు.
హరీష్ రావులో రోజురోజుకీ ప్రస్టేషన్ పెరుగుతోందని.. అందుకే ఏదేదో మాట్లాడుతూ తన పరువు తానే తీసుకుంటున్నారని అంటున్నారు బీసీ నేతలు. అన్నా మీ ఇమేజ్ డ్యామేజ్ అవుతోందని ఆయన అనుచరులు చెబుతున్నా.. వారిని దూరం పెడుతున్నారని చెబుతున్నారు. ఈటలను ఓడించాలని కేసీఆర్ ఇచ్చిన టాస్క్ పూర్తి చేయడానికి.. తన రాజకీయ భవిష్యత్తును హరీష్ ఫణంగా పెడుతున్నారని.. శృంగభంగం తప్పదని విమర్శిస్తున్నారు. హుజూరాబాద్ లో ఈటల గెలుపు తరువాత హరీష్ తన రాజకీయ భవిష్యత్తుకు చమరగీతం పాడడం ఖాయమని అంటున్నారు. మామ కళ్లల్లో ఆనందం చూడడం కోసం రోజుకొకలా ఈటలపై విమర్శలు చేస్తున్నారని.. హరీష్ మాటలు విని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారని సెటైర్లు వేస్తున్నారు బీసీ నాయకులు.
మొన్నేమో ఈటల గెలిస్తే ఆయనకు లాభం.. టీఆర్ఎస్ గెలిస్తే హుజూరాబాద్ కు లాభం అన్నారు.. నిన్నేమో ఈటల హుజూరాబాద్ ను అభివృద్ధి చేయలేదు.. డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టలేదు.. తన ఆస్తులు మాత్రం పెంచుకున్నారని చెప్పారు. ఇప్పుడేమో ఈటల సెంటిమెంట్ మాటలు మాట్లాడుతున్నారని.. ఆ మాటలకు మోసపోకండని అంటున్నారు. రేపు ఏం మాట్లాడతారో తెలియడం లేదని.. హరీష్ మతి భ్రమించి మాట్లాడుతున్నట్లుగా ఉందని ఆరోపిస్తున్నారు బీసీ నాయకులు. ఇతరుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే దొరలకు బడుగులు, దళితుల ఆత్మగౌరవం గురించి ఏం తెలుస్తుందని ప్రశ్నిస్తున్నారు. అసలు.. బడుగు బలహీన వర్గాలకు ఆత్మగౌరవం కోసం కోట్లాడడం, అవసరమైతే తిరుగుబాటు చేయడం మాత్రమే తెలుసని.. ఇతరులను అవమానపరచడం, వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడం తెలియదని గుర్తుచేస్తున్నారు. అదే.. దొరలకైతే ఇతరులను కించపరుస్తూ మాట్లాడడం.. వారి ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయడమే తెలుసని చురకలంటిస్తున్నారు. ఈటల ఆత్మ గౌరవాన్ని, తమ అభిమానాన్ని దెబ్బతీసేలా హరీష్ మాట్లాడింది వాస్తవం కాదా..? ఈటల కాలుకు దెబ్బ తగిలి హాస్పిటల్ లో ఉంటే ఒక మిత్రుడిగా పలకరించకపోగా డ్రామా ఆడుతున్నారు.. కాలుకు కట్టు కట్టుకొని వీల్ చైర్లో వచ్చి కొత్త నాటకం ఆడతారని అంటారా..? డ్రామాలు ఆడడం హరీష్, ఆయన మామకే తెలుసని మండిపడుతున్నారు.
ఆనాడు ఉద్యమం సమయంలో అగ్గిపెట్టె డ్రామా ఆడింది ఎవరు..? నిమ్స్ లో దీక్ష చేస్తున్నట్లు డ్రామా చేసింది ఎవరని నిలదీస్తున్నారు బీసీ నేతలు. తన దగ్గర ఉండాలనుకుంటే ఆత్మాభిమానాన్ని చంపుకొని ఉండాలనే ధోరణిలో కేసీఆర్ వ్యవహరించడం ఈటలకు నచ్చకే నిలదీశారని.. అందుకే కక్ష కట్టి వదిలించుకునేందుకు సొంత పత్రికలో తప్పుడు వార్తలు రాయించారని గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ పదే పదే ఆత్మాభిమానాన్ని కించపరుస్తూ మంత్రికి ఇవ్వాల్సిన విలువ కూడా ఇవ్వకుండా అవమానపరుస్తూ.. తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా, ప్రగతిభవన్ లోకి రానివ్వకుండా గేటు దగ్గరే ఆపేసి అవమానపర్చడం లాంటి చర్యలు ఈటల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం కాదా..? అని ప్రశ్నిస్తున్నారు.
దొర పాదాల దగ్గర ఈటల తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి పని చేయాలని హరీష్ రావు చెప్పదల్చుకున్నారా అని నిలదీస్తున్నారు బీసీ నాయకులు. అప్పటికీ ఈటల తన ఆత్మాభిమానాన్ని చంపుకొని పేదల కోసం తన గొంతు విప్పడం నేరమా అని అడుగుతున్నారు. దీనికి హరీష్ సమాధానం చెప్పాలని నిలదీస్తున్నారు. ఐకేపీ సెంటర్లు ఉండాలి.. అర్హులైన వృద్ధులందరికీ ఆసరా పెన్షన్ ఇవ్వాలి.. పేదలందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి.. పదవులు ఒకరిస్తే వచ్చేవి కావు కష్టపడితే వచ్చేవి.. ప్రజలు గుర్తిస్తే వచ్చేవి.. ఎవరి భిక్ష కాదు.. ప్రజలు పెట్టిన భిక్ష అని చెప్పడం ఈటల చేసిన నేరంగా భావించి ఆయన్ను అన్యాయంగా బర్తరఫ్ చేసింది నిజం కాదా అని ప్రశ్నిస్తున్నారు. మీకు మాత్రమే ఆత్మగౌరవం ఉంటుందా..? బడుగు బలహీన వర్గాలకు, దళితులకు ఆత్మగౌరవం, ఆత్మాభిమానం ఉండదా అని హరీష్ ను అడుగుతున్నారు. తెలంగాణ సమాజం ఆకలినైనా భరిస్తుంది కానీ.. ఆత్మగౌరవాన్ని వదులుకోదంటే అది హరీష్ కు ఎగతాళిగా, సెంటిమెంట్ డైలాగులా కనిపించడం ఆయన దొరతనాన్ని అహంకారాన్ని తెలియజేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీసీ నాయకులు.