– కోటలు దాటుతున్న నేతల మాటలు
– అమ్ముడుపోతున్న నాయకులు
– ఓటర్ల కొనుగోలుకు తీవ్ర యత్నాలు
– ఒకరు 20వేలు అంటుంటే.. ఇంకొకరు 40వేలు
– మునుగోడులో హుజూరాబాద్ సీన్ రిపీట్
– ఎన్నిక దగ్గర పడేకొద్దీ పీక్స్ కు ప్రలోభాల పర్వం!
హుజూరాబాద్ ఎన్నికల సమయంలో ఏం జరిగిందో చూశాం. సొంత పార్టీ నేతల్నే కొనుగోలు చేసుకునే పరిస్థితి టీఆర్ఎస్ కు వచ్చిందనే ఆరోపణలు గట్టిగా వినిపించాయి. దాదాపు 500 కోట్ల వరకు టీఆర్ఎస్ ఖర్చు పెట్టిందని ఇప్పటికీ ఈటల రాజేందర్ చెబుతూ ఉంటారు. ఎన్నిక సమయంలో ధన ప్రవాహం సాగిందని అంటుంటారు. అయితే, ఇప్పుడు మునుగోడులోనూ అలాంటి వాతావరణమే కనిపిస్తోందనే చర్చ సాగుతోంది. టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం చూస్తుంటే అనేక అనుమానాలు తావిస్తున్నాయి.
వచ్చే ఎన్నికలకు మునుగోడు సెమీ ఫైనల్ గా భావిస్తున్నాయి పార్టీలు. ఇందులో గెలిచే పార్టీకే భవిష్యత్ ఆశలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలైన బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటాపోటీ కొనసాగుతోంది. అయితే, టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాత్రం మాటల యుద్ధం ఓ రేంజ్ లో జరుగుతోంది. ప్రచారంలో భాగంగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ.. ఎవరెవరు ఎంత ఖర్చు పెడుతున్నారో చెబుతూ ప్రజల్ని ఆశ్చర్య పరుస్తున్నారు. వారు చెబుతున్న మాటల్ని బట్టి చూస్తే యావరేజ్ గా ఒక్కో ఓటుకు రూ.25వేల నుంచి రూ.40 వేలు ఖాయమన్నట్లుగా సీన్ మారిపోయింది.
రాజగోపాల్ రెడ్డి రూ.20 వేల కోట్ల కాంట్రాక్ట్ కు ఆశపడి బీజేపీలో చేరారని టీఆర్ఎస్ కొద్దిరోజులుగా ఆరోపణలు చేస్తోంది. ఉపఎన్నికలో రూ.500 కోట్ల వరకు ఖర్చు పెడతానని హమీ ఇచ్చారని.. ఓటుకు రూ.30 వేల వరకు పంచుతున్నారని గులాబీ నేతలు అంటున్నారు. అంతేకాదు, కాస్ట్లీ కార్లు, బైకులు కూడా ఆర్డర్ చేశారని ఆరోపిస్తున్నారు. బీజేపీ నేతలు కూడా అదే రేంజ్ లో కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. డబ్బుతో రాజకీయం చేస్తోంది టీఆర్ఎస్సేనని.. ఓటుకు రూ.40 వేలు ఇచ్చేందుకు కూడా వెనుకాడటం లేదని ఎదురుదాడి చేస్తున్నారు.
ఇరు పార్టీల మధ్య డబ్బు పంచాయితీ రావడంతో హుజూరాబాద్ ఎన్నికను గుర్తు చేస్తున్నారనే చర్చ సాగుతోంది. అప్పుడు కూడా ఇలాగే ఒకరిపై ఒకరు డబ్బులు పంచుతున్నారని నానా రాద్ధాంతం చేశారని కొందరు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి మునుగోడులో ఎన్నికల ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. నేతల మాటలు అయితే కోటలు దాటుతున్నాయి. మరి.. అందులో వాస్తవాలేంటో ఓటర్ల తెలియకుండా ఉండదు. ఎవరిని గెలిపించుకోవాలో అనేది వారి చేతిలోనే ఉంది.