– హాట్ టాపిక్ గా మల్లారెడ్డిపై దాడి
– టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్
– ఇది ప్రభుత్వంపై తిరుగుబాటేనంటున్న కాంగ్రెస్
– ఇలాంటివి ఇంకా జరిగే ఛాన్స్ ఉందంటున్న విశ్లేషకులు
మంత్రి మల్లారెడ్డిపై దాడి తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. దీనిపై అనేక భిన్న వాదనలు జరుగుతున్నాయి. గులాబీ నేతలు ఇది ముమ్మాటికీ హత్య చేసే కుట్రేనని అంటుంటే.. మల్లారెడ్డిని చంపడం.. పిట్టను చంపడం ఒకటే అనే అర్థం వచ్చేలా హస్తం నేతలు మాట్లాడుతున్నారు. అలాంటి అవసరం తమకేంటని గట్టిగానే వాదిస్తున్నారు. ఈ విషయంలో ఇరు పార్టీల మద్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. అయితే.. ప్రతిపక్షాలు, రాజకీయ పరిశీలకుల నుంచి వినిపిస్తున్న మాట ఒక్కటే. తెలంగాణ మళ్లీ తిరగబడుతోంది.
8 ఏళ్ల కేసీఆర్ అసమర్ధ పాలనకు మంత్రిపై దాడే నిలువుటద్దమని అంటున్నాయి ప్రతిపక్షాలు. ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి, ప్రభుత్వంపై కోపమే ఇలాంటి దాడులకు కారణమౌతున్నాయని అంచనా వేస్తున్నాయి. పైగా.. ఇదేదో టీఆర్‌ఎస్ సభ అయినట్టు కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తడం మల్లారెడ్డిపై దాడికి కారణంగా చెబుతున్నాయి. ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా.. కనీసం సొంత సామాజిక వర్గం డిమాండ్లను అసెంబ్లీలో వినిపించకుండా పదవులు అనుభవిస్తాం అంటే కుదరని పని అని.. ఏం చేయకపోయినా అది చేశాం.. ఇది చేశాం అని డబ్బాలు కొట్టుకోవడంతోనే ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయని వివరిస్తున్నాయి.
2014 ఎన్నికల సమయం నుంచి కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చారు. వాటిలో చాలావరకు మర్చిపోయారు. దళిత సీఎం గానీ, మూడు ఎకరాలు గానీ.. ఉచిత ఎరువులు గానీ.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాంతాడంత ఉంటుంది. అంతెందుకు మొన్నటికి మొన్న హుజూరాబాద్ లో గెలుపు కోసం తెచ్చిన దళిత బంధుపై ఇప్పటికీ సరైన క్లారిటీ లేదు. లబ్ధిదారుల్లో టీఆర్‌ఎస్ కు చెందిన వారే ఉంటున్నారనే విమర్శలు ఉన్నాయి. పైగా ఇది రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తారా? లేదా? అనే అనుమానాలు ఉన్నాయి. ఇలా అనేక విషయాల్లో అన్ని వర్గాల నుంచి ప్రభుత్వంపై అసమనం పెరిగిపోయిందని చెబుతున్నాయి ప్రతిపక్ష పార్టీలు.
టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు బాగాలేకనే మల్లారెడ్డిపై ప్రజలు దాడి చేశారని అంటున్నాయి. రానున్న రోజుల్లో ఇలాంటివి మరిన్ని జరిగే అవకాశాలు లేకపోలేదని హెచ్చరిస్తున్నాయి. టీఆర్‌ఎస్ నేతలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఇంకా పెరుగుతుందేగానీ తగ్గే పరిస్థితులు లేవని చెబుతున్నాయి. అంతలా ఈ 8 ఏళ్లలో కేసీఆర్ పాలన అధ్వాన్నంగా సాగిందని అంటున్నాయి. ముఖ్యంగా రైతులు, ఉద్యోగుల పట్ల టీఆర్‌ఎస్ సర్కార్ అనుసరిస్తున్న తీరుపై ఆయా వర్గాల్లో తీవ్ర అసహనం ఉందని గుర్తు చేస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు.. జీతాలు, పెన్షన్ల విషయంలో ఉద్యోగులు రగిలిపోతున్నారని చెబుతున్నాయి విపక్షాలు. రెడ్డి గర్జన సభలో అధికంగా పాల్గొన్నది రైతులే అని.. వారు పడుతున్న ఇబ్బందులు చాలవన్నట్లు.. మా సారు అది.. ఇది అంటూ మల్లారెడ్డి గొప్పలు చెప్పడం ప్రారంభించడంతోనే ప్రజల నుంచి తిరుగుబాటు ఎదురైందని వివరిస్తున్నాయి.