వికారాబాద్ జిల్లా పరిగిలో నిర్వహించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రజాభిప్రాయ సేకరణలో రసాభాస చోటుచేసుకుంది. ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ సంరక్షణపై అభిప్రాయాలు సేకరిస్తున్న క్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి హన్మంతు మాట్లాడుతుండగా గందరగోళం నెలకొంది. పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పోరాటం వల్లే ప్రాజెక్టు సాధ్యమైందని చెప్పడంతో అక్కడే ఉన్న కొందరు టీఆర్ఎస్ మద్దతుదారులు ప్రసంగాన్ని అడ్డుకున్నారు.
సమావేశం ప్రారంభమైన మొదటి నుండి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూనే ఉన్నారు. మీడియాను మొదటినుంచి అనుమతించలేదు. కలెక్టర్ కలగజేసుకుని ఓకే చెప్పడంతో లోపలికి పంపారు. అయితే వీడియోలు తీయనివ్వలేదు. ప్రజాభిప్రాయ సేకరణ షరతులు లేకుండా ఉండాలని, లోపలికి వెళ్లే వ్యక్తుల దగ్గర ఫోన్లు తోసుకోవడం ఏంటని ప్రశ్నించారు హన్మంతు ముదిరాజ్. సమావేశంలో తమ అభిప్రాయం తెలుపుతుంటే రైతుల ముసుగులో ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని.. ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో పోలీసుల పహారాతో గదిలో బంధించి సమావేశం నిర్వహించడం కరెక్ట్ కాదని చెప్పారు.
ఇది ప్రజాభిప్రాయ సేకరణ కాదని… నిర్బంధ సేకరణ అని ఆరోపించారు సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటయ్య. పోలీసులు బంధించి ప్రజాభిప్రాయ సేకరణ చేయడం విడ్డూరంగా ఉందన్నారు.