డబ్బులు పోయినా ఏం కాదుకానీ.. టిఫిన్ టేస్టీగా ఉండాలనుకుంటారు. కానీ.. కొందరికి నచ్చిన చోట ఇంకొందరికి నచ్చదు. కానీ.. వరంగల్ లోని ఓ హోటల్ లో కు వెళ్లి టిఫిన్ చేస్తే మాత్రం మరిచిపోలేరట. ఇంకోక విషయం ఏంటంటే.. అక్కడ ఇడ్లీ మాత్రమే స్పెషల్ అంట. ఇక వరంగల్ వెళ్లి.. యూసఫ్ బాబాయ్ ఇడ్లీ సెంటర్ అని ఎవ్వరినడిగా ఇట్టే చెప్పేస్తారట. ఇడ్లీ తినాలంటే అలంకార్ కు వెళ్లాల్సిందే అనేంతగా ఫేమస్ అంట.
వరంగల్ లోని అలంకార్ సెంటర్ లో 40 సంవత్సరాల క్రితం యూసఫ్ అనే వ్యక్తి ఒక చిన్న ఇడ్లీ బండి పెట్టాడు. నాటి నుంచి నేటి వరకు నిర్విరామంగా కొనసాగుతుంది. తరాలు మారుతున్నా ప్రజలకు అదే రుచిని అందిస్తూ వస్తున్నారు. అది కాస్త ఇప్పుడు వరంగల్ లో మహావృక్షంగా మారింది. యూసఫ్ బాబాయ్ ఇడ్లీ బండి అంటే వరంగల్ లో తెలియని వారు ఎవరూ లేనంతగా మారింది.
అలంకార్ మెయిన్ రోడ్ లో ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఇక్కడ ఇడ్లీలు అమ్ముతారు. ఇడ్లీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువగా ఇక్కడకు వస్తుంటారు. ఏంటి ఇంతకు ఏం స్పెషల్ అని ఆలోచిస్తున్నారా.. ఇక్కడ ప్రతి ఐటమ్ వారు స్వయంగా వారి ఇంట్లో తయారు చేసింది. ఇడ్లీలో వేసుకునే చెట్నీ నుంచి నెయ్యి వరకు ప్రతిది వాళ్ల ఇంట్లోనే తయారుచేస్తారు.
ఇక్కడ ఇడ్లీలో పల్లీ చట్నీ ఇస్తారు. దాంతో పాటుగా ఇంట్లోనే తయారు చేసిన కారప్పొడి.. అదేవిధంగా నెయ్యి వేస్తారు. అందుకే ఇక్కడ ఇడ్లీకి మరింత టేస్ట్ వస్తుందని ప్రజలు ఎక్కువగా ఇష్ట పడుతారు. ఉదయం ఈ సెంటర్ దగ్గర జనాలను చూస్తే ఏదైనా షాపింగ్ మాల్ ఓపెనింగా అన్నట్లుగా ఆ ప్రాంతం అంతా సందడిగా ఉంటోంది.
అలంకార్ ఇడ్లి అంటే వరంగల్ లో మాత్రమే ఫేమస్ కాదు.. పక్క జిల్లాల నుండి వచ్చే వాళ్ళు కూడా ముందుగా అలంకార్ ఇడ్లీ తిన్నాకే.. వాళ్లు వచ్చిన పని చేసుకుంటారనడంలో అతిశయోక్తి లేదు. అనునిత్యం ఉద్యోగరీత్యా వెళ్లేవాళ్లు, చిరు వ్యాపారులు, ప్రత్యేకంగా ఇడ్లీ తినాలి అనుకునేవాళ్ళు ప్రతి ఒక్కరు ఈ ఇడ్లీ సెంటర్ దగ్గర క్యూ కట్టాల్సిందే. చిన్న పెద్ద అంటూ తేడా లేకుండా ప్రతీ ఒక్కరు లొట్టలేసుకుంటూ అలంకార్ ఇడ్లీ తినాల్సిందే. ఒక్కసారి తిన్నారంటే చాలు ఇడ్లీ అంటే ఇష్టం లేని వాళ్లు కూడా.. వాళ్ల అభిప్రాయం మార్చుకుని ఇడ్లీ లవర్స్‌లా మారిపోతారు.
సహజంగా హోటల్ కు వెళ్తే.. అక్కడ ఉన్న హాట్ బాక్స్ లో నుండి తీసిన ఇడ్లీని ప్లేట్ లో వేసి ఇస్తారు. కానీ ఇక్కడ అలా కాదు.. వేడి వేడి ఇడ్లీ నేరుగా ఇడ్లీ కుక్కర్ లో నుండి తీసి వచ్చిన కస్టమర్ ప్లేట్ లో వేస్తారు. ఇక్కడ రూ. 30 పెట్టి.. ప్లేట్ ఇడ్లీ తిన్నారంటే మధ్యాహ్నం వరకు ఆకలి, నీకు గుర్తుకు రాదు అంటున్నారు కొందరు కస్టమర్స్. అయితే.. యూసఫ్ బాబాయ్ మరణించిన తర్వాత తన కొడుకులు ఇడ్లీ బండి నడుపుతున్నారు. యూసఫ్ ఉన్నప్పటి నుండి ఇప్పటివరకు ఇక్కడ ఇడ్లీలో టేస్ట్ ఏమాత్రం మారలేదు అంటున్నారు కస్టమర్స్.. అంత టేస్ట్ ఇడ్లీ మీరు కూడా తినాలి అనుకుంటున్నారా.. అయితే..ఒక్కసారి వరంగల్ వెళ్లి రావాల్సిందే.