– చిట్ ఫండ్ మాఫియా అండర్ టీఆర్ఎస్
– జనం నుంచి డబ్బులు వసూలు
– రియల్ ఎస్టేట్ రంగానికి మళ్లింపు
– చిట్టీ ఎత్తుకుని ఏడాది అయినా నో మనీ
– లే అవుట్ లో ప్లాట్ కొనాలని ఒత్తిడి
– కమీషన్ల కక్కుర్తిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
రాష్ట్రంలో పేరు మోసిన ఏ దందాను చూసినా టీఆర్ఎస్ నేతల నీడ స్పష్టంగా ఉంటోంది. వరంగల్ గడ్డపై జరుగుతున్న చిట్ ఫండ్ కంపెనీల ఇష్యూలోనూ అదే తంతు. గులాబీ ఎమ్మెల్యేల అండదండలతో చిట్ ఫండ్ కంపెనీలు రెచ్చిపోతున్నాయి. డబ్బులు ఇవ్వకుండా బాధితులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. దీంతో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి. పోలీసులు ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేసినా పొలిటికల్ పవర్ తో తప్పించుకుంటున్నారు చిట్ ఫండ్ నిర్వాహకులు. మొత్తం 10 మంది చిట్ ఫండ్ ఓనర్స్ పై ఫిర్యాదులు అందితే.. కేవలం ముగ్గురే అరెస్ట్ అయ్యారు. దీన్నిబట్టి కేసులను నీరుగార్చే ప్రయత్నాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో అర్థం అవుతోంది. దీనివెనుక ఇద్దరు ఎమ్మెల్యేలు చక్రం తిప్పుతున్నట్లు సమాచారం.
చిట్స్ దందాలు ఎలా ఉంటాయంటే..?
సెమీ అర్బన్ గ్రామలు, మున్సిపాల్టీలు, కార్పొరేషన్ లోని కొంత ఏరియాలో ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వల వేసి చిట్స్ వేయాలని ఎంజెట్ల ద్వారా భారీగా ప్రచారం చేయిస్తారు. పేద, మధ్య తరగతి కుటుంబాలే వీళ్ల టార్గెట్. అలా ఒక్కొక్క గ్రూప్ లో 50 మందితో 50 నెలలు చిట్స్ ప్రారంభిస్తారు. అయితే ఇంత మొత్తానికి షూరిటీ కింద స్థిరాస్తులు చూపించాలి. అందుకు చాలామంది రియల్ ఎస్టేట్ భూములను చూపిస్తున్నారు. అయితే అది చిట్స్ పేరుమీద కాకుండా సిస్టర్ సంస్థలపై ఉన్న అస్తులను రిజిష్ట్రర్ ఆఫ్ చిట్స్ లో పెడుతున్నారు. అయితే ఈ చిట్స్ లో 15 మంది వరకు డమ్మీలే ఉంటారు. కంపెనీకి చెందిన వారినే తీసుకుని మొదట వారికే ఇస్తారు. ఒకవేళ ఎవరైనా ఎక్కువ పాట పాడి దక్కించుకున్నా వారికి చుక్కలు చూపిస్తారు. 30 సంతకాలు తీసుకుని తెల్ల పేపర్ తో పాటు ప్రభుత్వ ఉద్యోగుల షూరిటీలు అడుగుతారు. అప్పుడన్నా డబ్బులు ఇస్తారా అంటే అదీలేదు. పోస్ట్ డేట్ చెక్స్ ఇచ్చి డబ్బులు లేవని.. చెప్పులు అరిగేలా తిప్పించుకుంటారు. ఏడాదిన్నర అయినా ఇవ్వరు. చివరకు తమ వద్ద ప్లాట్ కొనుగోలు చేయాలని బెదిరిస్తారు. నెల నెల అందరూ ఇచ్చిన డబ్బులతో భూములు కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ చేయడమే ఇందుకు కారణం. చేతిలో చిల్లిగవ్వ లేకుండానే జనాల డబ్బులతో రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. నిజానికి చిట్స్ డబ్బులు నెల నెల ఎవరికో ఒక్కరికి ఇచ్చి కమీషన్ పై మాత్రమే కంపెనీ పనిచేయాలి. కానీ.. చట్టానికి విరుద్దంగా దొంగ సభ్యులతో మొదటగా జనం నుంచి సొమ్ముని వసూలు చేసి రియల్ ఎస్టేట్ కు మళ్లిస్తున్నారు. ఎవరైనా కేసు పెట్టేందుకు వెళ్లితే సివిల్ మ్యాటర్ అని చెబుతున్నారు. తెల్ల పేపర్స్ పై తీసుకున్న సంతకాలతో బెదిరిస్తున్నారు.
లీడర్స్ తో కుమ్మక్కు.. కోట్ల రూపాయల దోపిడీ
జనాల సంపదను జలగల్లా పీల్చేస్తూ.. నేతలకు కమీషన్స్, పర్సంటేజీలు ఇస్తున్నారు. వీరంతా సిండికేట్ గా ఏర్పడి రియల్ ఎస్టేట్ మాయాజాలం చూపిస్తున్నారు. ఒక్క వరంగల్ లోనే 272 చిట్ ఫండ్స్ కంపెనీలు ఉన్నాయి. అందులో 10 కంపెనీలదే హావా. వారే పొలిటికల్ పవర్ తో అనుకున్నది చేస్తున్నారు. హన్మకొండ శివారులో 100 ఎకరాల వెంచర్ వేసి దాని కోసం ప్రత్యేకంగా 100 ఫీట్ల రోడ్డు ప్రభుత్వ సొమ్ముతో వేయించుకుని రేట్లు పెంచుకునేలా చేశారంటే.. నాయకులు, చిట్ ఫండ్ కంపెనీలు ఎలా కలిసిపోయాయో అర్థం చేసుకోవచ్చు.
బాధితుల హత్యలు, అత్మహత్యలు పట్టవా..?
అచల , శుభనందిని, అక్షర, కనకదుర్గతో పాటు మరో 6 కంపెనీలపై ఇప్పటి వరకు కేసులు నమోదయ్యాయి. అచల చిట్స్ లో భాదితుడు పిట్టల రాజు డబ్బులు అడుగుతున్నాడని ఏజెంట్ గణేష్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. గతేడాది సెప్టెంబర్ లో రాజు చనిపోయాడు. దీంతో ఓనర్ పంచగిరి సత్యనారాయణ జైల్లో ఉన్నాడు. వీటితో పాటు మరిన్ని కేసులు నమోదయ్యాయి. ఇన్నాళ్ల పాటు లైట్ తీసుకున్న పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు. అయితే ఇప్పుడు డబ్బుల గురించి ఎవరు వచ్చినా.. ఎఫ్ఐఆర్ చేసి జైలుకు తరలిస్తామని చెబుతున్నారు. దీంతో ముందస్తు బెయిల్ తీసుకుని జాగ్రత్త పడుతున్నారు చిట్ ఫండ్ కంపెనీల ఓనర్స్.