సంచలనం రేపిన మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. ప్రీతీని సీనియర్ సైఫ్ వేధించినట్లు నిర్ధారించారు. ఇతను ప్రీతిని టార్గెట్ చేసి వేధించినట్టు తేల్చారు. నాలుగు నెలలుగా ఈ వేధింపులు కొనసాగుతున్నాయని చెప్పారు. నిందితుడు సైఫ్ ను కోర్టులో హాజరుపరుస్తామని.. గ్రూప్ లో మెసేజ్ పెట్టి అవమానించొద్దని ప్రీతి వేడుకున్నా సైఫ్ కనికరం చూపలేదని తెలిపారు.
తనను ప్రశ్నించడాన్ని సైఫ్ సహించలేకపోయాడని ఆ కోపంతోనే ఆమెను టార్గెట్ చేశాడని చెప్పారు పోలీసులు. అతను వేధించినట్టుగా ఆధారాలు లభించాయని.. వాట్సాప్ గ్రూప్ లలో ప్రీతిని అవమానించేలా మెసేజ్ లు పెట్టాడని వివరించారు. ఈనెల 20న ప్రీతి వేధింపుల గురించి తండ్రికి చెప్పిందని.. 21న ఇద్దర్నీ పిలిచి కాలీజీ యాజమాన్యం విచారించిందని తెలిపారు.
వాట్సాప్ గ్రూపులో మెసేజ్ ల ద్వారా అవమానించడం కూడా ర్యాగింగ్ కిందకే వస్తుందన్న పోలీసులు.. సైఫ్ తన ఇతర మిత్రులతో చేసిన చాటింగ్ లో ప్రీతీని టార్గెట్ చేసినట్టు తెలిసిందన్నారు. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేశామని వివరించారు. ప్రీతి చాలా డేరింగ్ అండ్ సెన్సిటివ్ అని చెప్పారు.
జూనియర్ గా తనకు నేర్పించే క్రమంలో గట్టిగా చెప్పానని సైఫ్ చెబుతున్నాడని.. కానీ, అతని ఉద్దేశాలు మాత్రం వేరేగా ఉన్నాయని అంటున్నారు పోలీసులు. ఆమెకు సహకరించవద్దని తన ఫ్రెండ్స్ కు చెప్పాడని.. దీనిపై ఆధారాలను సేకరించినట్టు తెలిపారు. సైఫ్ సమస్య గురించి కంటిన్యూగా ఆలోచించి.. వేధిస్తున్నాడని భావించి.. మంగళవారం సాయంత్రం ఆత్మహత్యాయత్నం చేసిందన్నారు. ఆమె ఏ ఇంజెక్షన్ తీసుకున్నారో రిపోర్ట్ రావాల్సి ఉందని.. టాక్సికాలజీ రిపోర్ట్ వచ్చాక మరిన్ని వివరాలు తెలుస్తాయని చెప్పారు పోలీసులు.