రాజకీయ చదరంగంలో ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతాయి అంటే ఇదేనేమో.. ఒకప్పుడు వరంగల్ జిల్లాలో ఓ వెలుగు వెలిగిన నేతలు కొండా దంపతులు పొలిటికల్ ప్రెజర్స్ తో పార్టీలు మారారో లేక వ్యక్తిగత కారణాలతోనో తెలియదు కానీ మళ్ళీ తమ సొంత నియోజకవర్గాల్లో అడుగులు వేయనున్నట్టు తెలుస్తోంది. పరకాల నియోజక వర్గం లో తమకంటూ ఒక ఉన్నత స్థానాన్ని సంపాదించుకున్న నేతలిద్దరూ పార్టీలు మారి పరేషాన్ అయ్యారు. వరంగల్ జిల్లాలో కొన్నినెలలుగా హాట్ టాపిక్ గా నిలిచారు. ఎప్పుడైతే టీఆరెస్ పార్టీలో జాయిన్ అయ్యి వరంగల్ ఈస్ట్ లో అడుగు పెట్టారో అప్పుడే మొదలైంది అసలు లొల్లి. మొదలైంది. అప్పటికే వరంగల్ ఈస్ట్ లో ఎలాగైనా పాగా వేయాలని భావించిన నన్నపనేని నరేందర్ కన్న కలలు అడిఆశలయ్యాయి. నేనే ఎమ్యెల్యే అని భావించిన నన్నపనేనికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అధికార టీఆరెస్ పార్టీ నుండి వరంగల్ ఈస్ట్ అభ్యర్థిగా బి ఫామ్ పొందిన కొండా సురేఖ వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో ఘన విజయం సాధించి మంత్రి హరీష్ రావు తో నిర్వహించిన భారీ విజయోత్సవ ర్యాలీ నన్నపనేనికి నిద్రపట్టకుండా చేసింది. నన్నపనేని నరేందర్ ను తీవ్రంగా కలిచి వేసింది. ఆయన కార్యకర్తలను కలవరపెట్టింది. కేటీఆర్ వర్గమైన నరేందర్ ఎలాగైనా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించి మేయర్ పదవిని దక్కించుకోవాలని భావించి సక్సెస్ అయిన నరేందర్ ఇగ ఎలాగైనా కొండ వర్గానికి చెక్ పెట్టాలని అనుకున్నాడో ఏమో ప్రతి అడుగులో ఎమ్మెల్యే సురేఖ వర్సెస్ నన్నపనేని గా వరంగల్ ఈస్ట్ రాజకీయాలు మొదలయ్యాయి. చిలికి చిలికి గాలివానలా మారిన వీరి పోరు ఇక్బల్ మినార్ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను తాకేలా చేసింది. హరిశ్ రావు సురేఖకు,కేటీఆర్ నన్నపనేనికి నచ్చచెప్పాలని చూసినా వాళ్లిద్దరి తీరు మారకపోవడంతో నేరుగా ముఖ్యమంత్రే రంగం లోకి దిగాల్సి వచ్చింది. దీంతో కొండా దంపతులకు ఎదురుదెబ్బ తగిలి 2018 ముందు పార్టీ మారి తమ సొంత పార్టీ కాంగ్రెస్ కు మారారు. కాంగ్రెస్ పార్టీ నుండి పరకాల ఎమ్యెల్యే అభ్యర్థిగా పోటీచేసిన సురేఖ ఓటమి చెందింది. అదే సమయంలో కాంగ్రెస్ నుండి వరంగల్ ఈస్ట్ లో మాత్రం వద్ధిరాజు రవిచంద్రకు బి ఫామ్ ఇప్పించిన కొండా సరేఖ నన్నపనేని ఎలాగైనా ఓడించాలని ప్రయత్నించి విఫలమయ్యారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన వద్ధిరాజు తరువాత తిరిగి కాంగ్రెస్ వీడి టిఆర్ఎస్ లో చేరడంతో కొండాకి కోలుకోలేని దెబ్బే తగిలింది.
ఓటములతో కుంగిపోని కొండా దంపతులు అటు కూతురిని రాజకీయాలలోకి తీసుకురాలేక… ఇటు వాళ్ళ ఉనికిని కాపాడుకోలేక గడిచిన సంవత్సర కాలంగా మౌనంగా ఉన్న కొండా దంపతులు మళ్ళీ వరంగల్ ఈస్ట్ నియోజగక వర్గంలో అడుగుపెట్టి వచ్చే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో నా మనుషులను నిలబెడుతా.. నా క్యాడర్ ను, నా కార్యకర్తలను కాపాడుకుంటా నంటూ కొండా మురళి చేసిన వ్యాఖ్యలు పెను దుమరాన్నే లేపాయి. ఒకప్పుడు రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగి ఒక్కసారిగా మౌనంగా ఉన్నా కొండా దంపతులు మీకు నేనున్నా అంటూ మురళి చేసిన వ్యాఖ్యలు మాత్రం వారి అభిమానుల్లో ఆనందం నింపాయి. నన్నపనేని వర్గాన్ని మాత్రం ఒక్కింత కలవారికి గురిచేశాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు నన్నపనేని నరేంద్రను కలిసిన ఆయన అభిమానులకు మీరు అధైర్య పడకండి… ఎవ్వరూ ఇక్కడ పాగా వేయలేరు అని నన్నపనేని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే కొండా చేసిన వ్యాఖ్యలు వరంగల్ ఈస్ట్ లో తీవ్ర దుమారం లేపుతుంటే ఇది చూసిన వాళ్లంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటికే మూడు ముక్కల ఆటగా సాగుతున్న వరంగల్ ఈస్ట్ రాజకీయాలు కార్యకర్తలను మరింత అయోమయానికి గురి చేస్తున్నాయి. టీఆరెఎస్ పార్టీలో ఉన్న మాజీమంత్రి సారయ్య వర్గం ఒకవైపు.. అదే పార్టీలో ఉన్న వరంగల్ ఈస్ట్ ఎమ్యెల్యే నన్నపనేని నరేందర్ వర్గం ఒకవైపు.. కొండా వర్గం ఒక వైపు ఉన్నారు. దీంతో ఈస్ట్ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారాయి.
కొండా, నన్నపనేని లొల్లితో వేడెక్కిన వరంగల్ ఈస్ట్ రాజకీయాలు ఒక సంవత్సరం పాటు నిశ్శబ్దంగా ఉన్నా మళ్లీ ఒక్కసారిగా అలజడి రేపాయి. వీరి ఇద్దరి తీరు మున్ముందు ఎలా మారబోతుందోనని వరంగల్ ఈస్ట్ లొనే గాక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో వరంగల్ ఈస్ట్ లో కొండా వేసిన అడుగు ఏవిధంగా ఉండబోతున్నాయో వేచి చూడాలి మరీ…