ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన ఫైర్ బ్రాండ్ లీడర్ సైలెంట్ అయ్యారు. భర్త చాటున వుండి జిల్లాలో వారికంటూ సొంత సైన్యాన్ని సంపాదించుకున్న ఆ మహిళా నేత తెర మరుగు అవుతున్నారు. ఎవరా మహిళా నేత? రాజకీయంగా ఆమె వ్యూహం ఎలా ఉండబోతుంది?
వరంగల్ ఉమ్మడి జిల్లా గీసుగొండ ఎంపిపి గా రాజకీయ అరంగ్రేట్రం చేసిన మహిళా లీడర్ కొండా సురేఖ. ఆమె భర్త కొండా మురళీధర్ అండతో కాంగ్రెస్ పార్టీ లో రాజకీయ ఓనమాలు నేర్చుకొని అనతి కాలంలోనే రాష్ట్ర స్ధాయిలో మహిళా నేత గుర్తింపు తెచ్చుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులతో తొలి సారిగా శాయంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది. అసెంబ్లీలో అడుగు పెట్టారు. నియోజకవర్గాల పునర్విభజనతో భూపాలపల్లి నియోజకవర్గంగా ఏర్పడటంతో పరకాల కు వెళ్లాల్సి వచ్చింది. నాటి నుంచి రాజకీయంగా ఎదుగుతూ పరకాల నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి వైయస్ క్యాబినెట్ లో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గా పనిచేశారు. మారిన రాజకీయ పరిణామాలతో రాజశేఖరరెడ్డి మరణం తర్వాత వైయస్ జగన్ స్దాపించిన వైయస్ ఆర్ కాంగ్రెస్ లో చేరి అప్పటి ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే గా ఓటమి పాలయ్యారు. తదనంతరం తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో జగన్ కు అండగా నిలిచి మహబూబాబాద్ లో రాళ్ల దెబ్బ లు తిని ప్రాణాలతో బయటపడ్డారు. ఈసంఘటన అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచన మేరకు టీఆర్ఎస్ లో చేరి ముచ్చటగా నాలుగో సారి వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీఆర్ఎస్ పార్టీ లో చేరినప్పటికి ఆ పార్టీలో అసంతృప్తిగానే వున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ నిరాకరించింది. దీంతో టీఆర్ఎస్ అధిష్టానం పై సురేఖ విమర్శలు చేశారు. పార్టీ లో నియంతృత్వ పోకడ, దొర తనం వుందని, కెసిఆర్ కెటిఆర్ ల పై ఆరోపణలు చేసింది. ఇక్కడ సీన్ కట్ చేస్తే ఆ పార్టీ కి గుడ్ బై చెప్పారు. ముందస్తు గానే కాంగ్రెస్ లో చేరుతారు అనే ఊహాగానాలు వచ్చాయి. కాకుంటే సురేఖ తో పాటు కూతురు సుష్మితా పటేల్ కు భూపాలపల్లి టికెట్ ఆశించారు. కానీ సురేఖ ను పార్టీ లోకి ఆహ్వానించిన కాంగ్రెస్, కూతురుకు కాకుండా సురేఖకు మాత్రమే టికెట్ ఇచ్చారు. టీఆర్ఎస్ గాలికి కొండా సురేఖ తన నియోజకవర్గం అయిన పరకాలలో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో, స్ధానిక సంస్ధల ఎన్నికల్లో నూ అంటిముట్టనట్లుగా వ్యవహరించారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలుగా కొండా సురేఖ సైలెంట్ అయ్యారు. నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా కొనసాగిన కొండా సురేఖ ప్రస్తుతం ఎలాంటి పదవి లేకుండా వుండటం జిల్లా వ్యాప్తంగా ఉన్న కొండా అనుచరులు తీవ్ర అసంతృప్తి లో వున్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకు కుదేలు అవుతున్న నేపథ్యంలో కొండా చూపు జాతీయ పార్టీ బిజెపి వైపు మల్లు తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంకా నాలుగేళ్ల పాటు ఇదే కాంగ్రెస్ పార్టీ లో వుంటారా… బిజెపి వైపు అడుగులు వేస్తారో వేచి చూడాల్సిందే మరి.