పర్యాటకంగా చాలా ప్రాధాన్యత ఉన్న జిల్లా వరంగల్. వరంగల్ లోని కాకతీయుల ఖిల్లాను చూడడం కోసం నిత్యం వందలాది మంది పర్యాటకులు వస్తుంటారు. వారికి వసతి కల్పించడం కోసం టూరిజం శాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా హరిత కాకతీయ హోటల్స్ ను నిర్మించింది. కానీ హన్మకొండ హరిత హోటల్ మాత్రం అందుకు భిన్నంగా నడుస్తుంది. వరంగల్ అర్బన్ జిల్లాకు వచ్చివెళ్లే పర్యాటకుల కోసం ఏర్పాటుచేసిన హరిత కాకతీయ హోటల్ అప్రదిష్టపాలవుతూ రాజకీయాలకు అడ్డాగా మారుతుంది. ఈ హోటల్ నిర్మించిన నాటి నుండి నేటి వరకు ఎక్కువ శాతం రాజకీయ నాయకుల అంతర్గత సమావేశాలకు, ల్యాండ్ సెటిల్మెంట్లకు వేదికగా మారిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. హోటల్ పరిసరాల్లో ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా జనం కనిపిస్తుంటారు. హోటల్ వేదికగా పంచాయతీలు నిర్వహిస్తుంటారు. ఇది పర్యాటకులకు తీవ్ర ఇబ్బంది కరంగా మారింది.
పర్యాటకులను ఆకర్షించి, ఆహ్లాదాన్ని పంచాల్సిన హరిత హోటల్ లో జరుగుతున్న కార్యకలాపాలు అధికార వర్గాలకు తలనొప్పిగా మారడంతో అధికారులు గతంలోనే సంచలన నిర్ణయం తీసుకున్నారు. హరిత హోటల్ లో సెటిల్మెంట్లు నిషేధం అంటూ బోర్డు కూడా పెట్టారు.ఈ హోటల్ వరంగల్ పర్యటనకు వచ్చే పర్యాటకుల సౌకర్యార్థం ఏర్పాటు చేయబడినది. రెస్టారెంట్ లో కానీ, హోటల్ పరిసరాలలో గానీ ఎటువంటి గ్రూప్ మీటింగ్ లు పెట్టరాదు. ఎవరైనా దీనిని ఉల్లంఘించినట్లు తెలిస్తే తగు చర్యలు తీసుకోబడును. ఇట్లు సుబేదారి పోలీస్ స్టేషన్ హనుమకొండ అంటూ ఏకంగా బ్యానర్ కూడా పెట్టారు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఏదో బోర్డు పెట్టారు తప్ప మమ్మల్ని సెటిల్మెంట్లు చేసుకోవద్దంటూ చెప్పలేదు కదా అనుకున్నారో లేక ఎవరు మమ్మల్ని ఆపేది అనుకున్నారో ఏమో కానీ టూరిజం హోటల్ హరితలో మాత్రం నిత్య సెటిల్మెంట్ లు కొనసాగుతూనే ఉన్నాయి. ఉండటానికి రూమ్ లు… తాగడానికి అందులోనే బార్ ఉండడంతో సెటిల్మెంట్ బాబులకు ఏ కొరతా లేదు. ఈ సెటిల్మెంట్ గాళ్ళకు అండగా కొందరు రాజకీయ నాయకులూ, అధికారులు కూడా తోడవడంతో విల్లా బిజినెస్ మూడుపువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది. అధికార పార్టీ నేతల మీటింగ్ లకు అడ్డా కూడా హరిత కాకతీయ హోటలే అయ్యింది.
అధికార పార్టీ నేతల రాజకీయ చర్చలు కూడా ఇక్కడే జరుగుతుంటాయి. టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఉండే ఈ హోటల్ లో జిల్లాకు సంబంధించిన మంత్రుల హడావుడి ఎప్పటికీ కనిపిస్తుంది. గతంలో టూరిజం శాఖ మంత్రిగా అజ్మీర చందూలాల్ ఉన్న సమయంలో కూడా ఈ హోటల్ ను పలు వ్యక్తిగత అవసరాలకు, పార్టీకి సంబంధించిన కార్యకలాపాలకు ఉపయోగించారన్న ప్రచారం ఉంది. ఇక హరిత కాకతీయ హోటల్ ప్రారంభం నుంచి రాజకీయనాయకుల హోటల్ గా మారింది. హరిత హోటల్ లో అడుగు పెట్టగానే తెల్లని ఖద్దరు అంగీలతో ఖద్దరు బాబులు (సెటిల్మెంట్ బాబులు) దర్శనం ఇస్తుండడంతో పర్యాటకులు ఇక్కడకు రావాలంటేనే భయపడుతున్నారు. ఫ్యామిలీ తో వచ్చే టూరిస్టులు అయితే ఇక్కడి పరిస్థితిని చూసి వెంటనే వేరే హోటల్ కు షిప్ట్ అవుతున్నారు. దీంతో హరితకు హోటల్ కు వచ్చే టూరిస్టుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఇంత జరుగుతున్నా పోలీసులు, అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు.
ఇప్పటికైనా అధికార యంత్రాంగం కళ్లు తెరిచి కాకతీయ హరిత హోటల్ కు.. వరంగల్ టూరిజానికి ఉన్న పేరు చెడగొట్టకుండా చర్యలు చేపడతారని ఆశిద్దాం…