వరంగల్ కేఎంసీ మెడికల్ స్టూడెంట్ ప్రీతి కేసులో నిందితుడు సైఫ్ ను శుక్రవారం ఉదయం హన్మకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో నిందితుడు సైఫ్ ను వరంగల్ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ఈ కేసులో నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఆ తర్వాత సైఫ్ ను ఖమ్మం జైలుకు తరలించనున్నారు.
అంతకుముందు సైఫ్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు ర్యాగింగ్ కేసు కూడా నమోదు చేసినట్లు వరంగల్ సీపీ రంగనాథ్ వెల్లడించారు. కేఎంసీ మెడికో స్టూడెంట్ ప్రీతిని ఆమె సీనియర్ సైఫ్ వేధించినట్టుగా పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. సైఫ్, ప్రీతి వాట్సాప్ చాట్ ల నుండి సమాచారం సేకరించినట్లు తెలిపారు.
సైఫ్ గత నాలుగు నెలలుగా ప్రీతిని వేధిస్తున్నట్లు ఆధారాలున్నాయని సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. సైఫ్ వేధింపులు తట్టుకోలేకనే ప్రీతి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిందని సీపీ వివరించారు.
కాగా స్టూడెంట్ సైఫ్ కు మద్దతుగా ఎంజీఎంలో ఎంబీబీఎస్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. సైఫ్ అరెస్ట్ ను తప్పుబడుతూ శుక్రవారం ఎంజీఎం మెయిన్ గేట్ వద్ద ప్లకార్డుతో నిరసనకు దిగారు. ప్రీతి సూసైడ్ చేసుకోవడం బాధాకరమైన విషయమే అయినా.. కేసు విచారణ పూర్తి కాకుండానే సైఫ్ విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ మేరకు సైఫ్ కు మద్దతుగా నిలిచిన విద్యార్థులు ఎంజీఎం సూపరింటెండెంట్ కు సమ్మె నోటీసులు ఇచ్చారు.