వరంగల్‌లో ఇన్నర్ రింగ్ రోడ్ కోసం భూములిచ్చిన వారి పరిస్థితి దుర్భరంగా మారింది. అటు భూమిని తమ అవసరాలకు వినియోగించుకోలేక, ఇటు దానికి పరహారమూ అందక దిక్కుతోచని స్థితిలోపడ్డారు. ఏళ్లు గడుస్తున్నా సర్కార్ నుంచి ఏ భరోసా లేకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు.
వరంగల్‌లోని నాయుడు పంపు నుంచి ఆరెపల్లి వరకు ప్రభుత్వం ఇన్నర్ రింగ్ రోడ్ (200 ఫీట్స్) నిర్మించాలని గతంలో ప్రతిపాదించింది. అయితే రోడ్డు వెళ్లే మార్గంలోని వ్యవసాయదారులు, ఫ్లాట్ల యజమానులు స్వచ్ఛందంగానే తమ భూమిని ప్రభుత్వానికి ఇచ్చారు. కానీ అదే వారిని కష్టాలపాలు చేసింది. రెండేళ్లుగా నష్టపరిహారం రాక.. వారు సమస్యలతో సతమతం అవుతున్నారు. చాలా ఆందోళనల తర్వాత 2019లో కొద్దిమందికి నష్ట పరిహారం చెల్లించింది ప్రభుత్వం. కానీ మరో 200 కుటుంబాలకు ఇంతవరకు పైసా ఇవ్వలేదు. ఇందులో ఎక్కువగా నిరుపేద, మధ్యతరగతికి చెందినవారే ఉన్నారు. ఎన్నిసార్లు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. పోనీ ఆయా భూముల్లో ఏదైనా చేద్దామన్న అవకాశం ఇవ్వడం లేదు. దీంతో వారి పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారింది.
భూసేకరణ చట్టం- 2013, సెక్షన్ 11 ప్రకారం స్వచ్ఛందంగా భూమిని ఇస్తే నష్ట పరిహారం వెంటనే ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని.. కానీ తమ విషయంలో ప్రభుత్వం దారుణంగా మోసం చేస్తోందని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం పరిహారం చెల్లిస్తే వేరే ఉపాధి చూసుకుందామని అనుకున్నామని.. కానీ ఇప్పుడు ఉన్న ఆస్తులు పోయి దీనస్థితిని ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ప్రభుత్వం వెంటనే స్పందించి.. తమకు రావాల్సిన పరిహారాన్ని చెల్లించాలని కోరుతున్నారు.