– అత్యంత విషమంగా ప్రీతి ఆరోగ్యం
– వెంటిలేటర్ పైనే చికిత్స
– వెలుగులోకి సంచలన నిజాలు
– ర్యాగింగ్ ఉండదన్న డీఎంఈ
– బాధితురాలి తండ్రి ఆగ్రహం
– బయటపడ్డ ఏసీపీ నిర్లక్ష్యం
– సైఫ్ వేధింపులపై ముందే హెచ్చరిక
– అయినా, పట్టించుకోని ఏసీపీ
– ప్రీతి తండ్రి మెసేజ్ లకు నో రిప్లై
– నిజానిజాలు తేల్చేందుకు కమిటీ
– ఖాకీల అదుపులో నిందితుడు
– ర్యాగింగ్, అట్రాసిటీ కేసు నమోదు
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో సీనియర్ల వేధింపులు తట్టుకోలేక హానికారక ఇంజక్షన్ తీసుకున్న వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నంపై కమిటీ ఏర్పాటైంది. నలుగురు ప్రొఫెసర్లతో ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కేసు వివరాలు పరిశీలించిన తర్వాత అందించే రిపోర్టును సీల్డ్ కవర్ లో డీఎంఈకి ఇస్తారు. ఇటు ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనకు సంబంధించి డీఎంఈ రమేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. ఆమె తండ్రి నరేందర్ స్పందిస్తూ.. ర్యాగింగ్ జరగలేదని డీఎంఈ చెప్పడం సరికాదని అన్నారు. కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ర్యాగింగ్ వల్లే తన కూతురు ఆత్మహత్యాయత్నం చేసిందని అంటున్నారు. ర్యాగింగ్ జరుగుతోందని తన కూతురు చెప్పిందని.. దీనిపై సంబంధిత పోలీస్ స్టేషన్ కు కూడా తాను సమాచారం ఇచ్చానని చెప్పారు. అందుకు సంబంధించిన మెసేజ్ లు కూడా ఉన్నాయని తెలిపారు.
డీఎంఈ ఏమన్నారంటే?
అంతకుముందు నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రీతీని డీఎంఈ రమేష్ రెడ్డి పరామర్శించారు. వైద్యులను అడిగి ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రీతి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని అన్నారు. పీజీ స్టూడెంట్స్ మధ్య ర్యాగింగ్ ఉండదని చెప్పారు. అండర్ గ్రాడ్యుయేషన్ లో ఫస్టియర్, సెకండియర్ లో ర్యాగింగ్ ఉంటే ఉండొచ్చని అన్నారు. డాక్టర్ ప్రీతి విషయంలో ఏ రకమైన వేధింపులు జరిగాయనే విషయమై విచారణ జరుగుతుందని తెలిపారు. విధుల విషయంలో సీనియర్ గా తాను ప్రీతీకి చెప్పానని సైఫ్ నుండి తమకు సమాధానం వచ్చిందన్నారు.
ఎక్మో సపోర్ట్ తో..!
ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు నిమ్స్ డాక్టర్లు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నామన్నారు. మల్టీ ఆర్గాన్స్ పూర్తిగా ఫెయిల్ అయ్యాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎక్మో సపోర్ట్ తో చికిత్స అందిస్తున్నట్లు నిమ్స్ వైద్యులు వెల్లడించారు. డాక్టర్ల ప్రకటనతో ప్రీతి కుటుంబసభ్యులు, తోటి విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని స్నేహితులు కోరుకుంటున్నారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన ప్రీతి కేఎంసీలో పీజీ మొదటి సంవత్సరం చదువుతోంది. శిక్షణలో భాగంగా ఎంజీఎంలో విధులు నిర్వహిస్తోంది.
నిందితుడి అరెస్ట్
ఈ కేసులో నిందితుడు సైఫ్ పై ర్యాగింగ్, అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. క్రైమ్ నంబర్ 69/2023 యూ/ఎస్ 306 ఆర్/డబ్ల్యూ 108, 354 ఆఫ్ ఐపీసీ, 4(వీ) ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్, 3(1)(ఆర్), 3 (2)(వీఏ), 3(1)(డబ్ల్యూ)(ఐఐ) ఆఫ్ ఎస్సీ, ఎస్టీ యాక్ట్ నమోదు చేశామని చెప్పారు. బాధితురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి కేసు నమోదు చేశామని.. తదుపరి విచారణ అనంతరం శాఖా పరమైన చర్యలు ఉంటాయని వివరించారు.
పోలీస్ నిర్లక్ష్యం
ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనకు వరంగల్ ఏసీపీ బోనాల కిషన్ నిర్లక్ష్యం కూడా కారణంగా చెబుతున్నారు బాధితురాలి తండ్రి. నిందితుడు సైఫ్ చేస్తున్న అఘాత్యాల గురించి ప్రీతి తన తండ్రికి చెప్పింది. ఈయన వరంగల్ రైల్వే పోలీస్ లో ఏఎస్సై కావడంతో ప్రొటెక్షన్ లభిస్తుందని అనుకున్నారు. ఏసీపీ బోనాల కిషన్ కు ఫోన్ చేసి వివరాలు చెప్పినా స్పందించలేదు. మెసేజ్ పంపినా సరిగ్గా రెస్పాండ్ కాలేదు. ఈ క్రమంలోనే సైఫ్ వేధింపులు తట్టుకోలేక, పోలీసులు పట్టించుకోకపోవడంతో మనస్థాపంతో తన కూతురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని చెబుతున్నారు. తనకు హోంమంత్రి మహమూద్ అలీ అండదండలు ఉన్నాయని సైఫ్ బెదిరించేవాడని చెప్పారు ప్రీతి తండ్రి.
గవర్నర్ పరామర్శ
నిమ్స్ లో చికిత్స పొందుతున్న ప్రీతీని గవర్నర్ తమిళిసై పరామర్శించారు. ఆమె ఆరోగ్యం క్రిటికల్ గానే ఉందని అన్నారు. వైద్యానికి సహకరించి త్వరగా కోలుకుని తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఈ కేసులో చాలా పరిణామాలు జరిగాయని.. ఏం జరిగిందనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. స్టూడెంట్స్ అందరూ ధైర్యంగా ఉండాలని చెప్పారు. కేసులో విచారణ పూర్తి స్థాయిలో జరగాలని గవర్నర్ పోలీసులను కోరారు. ప్రీతి చాలా క్లెవర్ స్టూడెంట్ అని విన్నాను… అలాంటి అమ్మాయి ఆత్మహత్యాయత్నం చేసుకోవడం బాధాకరమని అన్నారు తమిళిసై.